‘ఫార్ములా – ఈరేస్’ కేసులో తనను అరెస్టు చేయరని.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయదని వ్యాఖ్యానించారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పారు. విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు సహకరిస్తూనే ఉన్నానని.. ఇక నుంచి కూడా తన సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కేటీఆర్ స్పందించారు. గవర్నర్ తన పని తాను చేశారని.. ఒకరకంగా ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే విషయం కూడా చర్చిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే తన విచారణను వాయిదా వేసి ఉంటారన్న అభిప్రాయం ఉందని తెలిపారు. తాను అన్నీ నిజాలే చెప్పానని.. ఇకపై కూడా అలానే వ్యవహరిస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంలో దాచేందుకు ఏమీ లేదన్నారు.
అవసరమైతే.. తనను లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. తాను ఎలాంటి పరీక్షలకైనా.. విచారణలకైనా సిద్ధమేనని తెలిపారు. గతంలో తాను చేసిన లొట్టపీసు కేసు మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కేసేనని కేటీఆర్ తెలిపారు. ఇక, రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ అన్యోన్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి బంధం-సంబంధం దేశంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ చెప్పారు. అయితే.. వేటు భయపడి కొందరితో రాజీనామాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారని.. అయినా.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పా రు. ఉప ఎన్నికల్లో ఈ సారి తమదే విజయమని.. ప్రభుత్వం పరంగా ఎలాంటి ప్రభావం లేదని వ్యాఖ్యానిం చారు.