ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను 420 అంటూ విమర్శించిన వారే(వైసీపీ నేతలు).. ఇప్పుడు 420 అయ్యారని అన్నారు. అన్ని విధాలా.. రాష్ట్రాన్ని ప్రజలను కూడా మోసం చేశారని బాబు విమర్శించారు. దీంతో రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ప్రజలను అన్ని విధాలా నమ్మించి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. 420 పనులు చేసి.. ప్రజలు పక్కన పెట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే 10 సంవత్సరాల పాటు.. ముఖ్యమంత్రిగా సేవ చేసేందుకు తనకు ఓపిక ఉందని.. ప్రజలకు మేలు చేయడమే తప్ప.. మరో ఆలోచన తనకు లేదన్నారు. గతంలో ఐటీని ప్రోత్సహించానని.. ఇప్పుడు పారిశ్రామిక వేత్తలుగా ప్రతి ఇంటి నుంచి ఒకరు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఏఐ నిపుణులు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
“కేంద్రంలోని మోడీ.. రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం ఎంతో ఉంది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం.. వెనుకబడిన ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కరువు ప్రాంతాల్లోనూ తాగునీరు ఇస్తున్నామన్నారు. రాయలసీమ ఒకప్పుడు .. రాళ్ల సీమగా మారుతుందని కొందరు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు రతనాల సీమగా మారుస్తున్నట్టు చెప్పారు.
లోకేష్ బాగా కష్టపడుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏచిన్న ఐడియా ఇచ్చినా.. లోకేష్ వెంటనే కార్యాచరణకు దిగుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో రోజుల తరబడి కూడా కష్టపడుతున్నారని చెప్పారు. ఆయన కష్టంతోనే అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయని తెలిపారు. విశాఖలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు దీనికి వేదిక కానుందన్నారు. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు.. గోదావరి-కృష్ణా నదుల జలాలను పారించి.. ఇక్కడివారికి తాగు, సాగునీరు అందిస్తామన్నారు.