hyderabadupdates.com movies పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని.. ఇవి వార‌సత్వంగా ఎలా సంక్ర‌మించాయో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. ఇదేస‌మ‌యంలో దానికి సంబంధించి త‌మ‌కు నివేదిక అందించాల‌ని కూడా ఆదేశించారు. ఎక్క‌డైనా అట‌వీ భూముల్లో వార‌స‌త్వం ఉంటుందా? అన్న ప్ర‌శ్న‌ను కూడా రైజ్ చేశారు.

ఈ ప‌రిణామాల‌పై పెద్దిరెడ్డి వార‌సుడు, ఎంపీ మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాము అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించ‌లేద‌న్న ఆయ‌న‌.. వాటిని కొనుగోలు చేశామ‌ని తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే తాము భూములు కొనుగోలు చేశామ‌ని చెప్పారు. వీటికి సంబంధించి త‌మ‌కు అన్ని ర‌కాల హ‌క్కులు ఉన్నాయ‌ని తెలిపారు. కావాలంటే.. ఆన్‌లైన్‌లో స‌ర్వే నెంబ‌ర్ల వారీగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌ని.. తమ వ‌ద్ద అన్ని ప‌త్రాలు ఉన్నాయ‌ని ఎంపీ తెలిపారు.

ఇదేస‌మ‌యంలో ఆయా భూముల‌ను తాము ఆక్ర‌మించుకున్న‌ట్టు నిరూపించ‌గ‌ల‌రా? అని ప‌వ‌న్‌కు స‌వాల్ రువ్వారు. ఆక్ర‌మ‌ణ కాదు.. కొనుగోలు చేశామ‌ని తాము నిరూపిస్తామ‌న్నారు. అప్పుడు త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌మ కుటుంబాన్ని అభాసు పాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. గ‌తంలో కూడా ఎర్ర‌చంద‌నంపై ఇలానే విమ‌ర్శ‌లు చేశార‌ని.. అప్పుడు కూడా తాము నిజాయితీని నిరూపించుకున్నామ‌న్నారు.

రాజ‌కీయంగా త‌మ కుటుంబాన్నిఎదుర్కొన‌లేక‌.. అట‌వీ భూములు ఆక్ర‌మించుకున్నార‌ని.. ఎర్ర‌చంద‌నం దొంగిలించార‌ని ఆరోప‌ణలు చేయ‌డం సరికాద‌ని మిథున్ రెడ్డి చెప్పారు. ఏదైనా ఉంటే రాజ‌కీయంగా ఎదుర్కొనాల‌న్నారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌కంగా ఉన్నామ‌ని చెప్పారు. త‌మ‌వ్యాపారాలు.. వ్య‌వ‌హారాలు అన్నీ నిజాయితీగా సాగుతున్నాయ‌న్న ఆయ‌న‌.. వాటి ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అందిస్తున్నామ‌ని వివ‌రించారు.

Related Post