జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సుతో ఈ నిధులు కేటాయించబడినట్లు దేవాదాయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు.
పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు ఆలయం ప్రత్యేక సెంటిమెంట్‌గా మారింది. ఆయన రాజకీయ జీవితంలో కీలక దశలన్నింటిలోనూ ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ ప్రారంభ సమయంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడం, ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు చేయించడం ఇందుకు నిదర్శనం.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆలయ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం వసతి కోసం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు వినియోగించనున్నట్లు సమాచారం. 2024 జూన్‌లో వారాహి దీక్షలో భాగంగా కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆలయ అధికారులు అభివృద్ధి నిధుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, అందుకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.