పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతోనే ముగిసిపోతుందనే అంచనాలున్నాయి. కానీ ఆ తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందనే ఆశ అభిమానులది. ఆ దిశగా పవన్ కాస్త ఊరిస్తున్నారు కానీ.. ఆయన వీలు చేసుకుని నటించగలరా అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఓజీ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ చేసే అవకాశాలున్నాయని, కానీ కండిషన్స్ అప్లై అని పవన్ వ్యాఖ్యానించి అభిమానులను ఆశల పల్లకిలో ఉంచేశారు.
మరోవైపు తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు.. పవన్‌తో ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈ దిశగా రాజు కూడా సంకేతాలు ఇచ్చాడు. హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని సాయిరాం థియేటర్లో అభిమానులతో కలిసి ఓజీ సక్సెస్ సెలబ్రేషన్లలో పాల్గొన్న రాజు.. పవన్‌తో వకీల్ సాబ్ తర్వాత ఇంకో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నామని… కానీ పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని వ్యాఖ్యానించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
ఒకవేళ పవన్.. రాజు నిర్మాణంలో సినిమా చేస్తే దాన్ని రూపొందించే దర్శకుడెవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇందుకు సమాధానంగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. ఇప్పటిదాకా కెరీర్లో అజయమే ఎరుగని దర్శకుడు అనిల్. అతను కెరీర్లో చాలా వరకు దిల్ రాజు బేనర్లోనే సినిమాలు చేశాడు. ప్రస్తుతం షైన్ స్క్రీన్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ మూవీ చేస్తున్నాడు. అది సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ తర్వాతి సినిమాపై ఇంకా ఏ సమాచారం లేదు. పవన్ కళ్యాణ్ కనుక డేట్లు ఇస్తే అనిల్ దర్శకత్వంలో సినిమా చేయాలన్నది దిల్ రాజు ఆలోచన.
బాలయ్యతో అనిల్ తీసిన భగవంత్ కేసరి తరహాలో ఇది మెసేజ్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ అని అప్పుడే కథ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ పొలిటికల్ ఇమేజ్, అనిల్ కామెడీ టచ్.. రెండూ మిక్స్ చేసి ఈ సినిమా చేయాలన్న ఆలోచన ఉందట. ఉస్తాద్ భగత్ సినిమాను పూర్తి చేశాక పవన్.. పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆయన కొత్త సినిమా గురించి ఆలోచించే అవకాశముంది. అనిల్ ఎలాగూ స్పీడుగా సినిమా లాగించేస్తాడు కాబట్టి పవన్ ఒక నెల రోజుల కాల్ షీట్స్ ఇస్తే. చాలేమో.