hyderabadupdates.com movies పవన్ వచ్చే… అడవిలో ఉన్న గూడెం కి కరెంట్ తెచ్చే

పవన్ వచ్చే… అడవిలో ఉన్న గూడెం కి కరెంట్ తెచ్చే

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఇళ్లతో ఉంది ఆ గ్రామం. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న కష్టాలు బాహ్య ప్రపంచానికి తెలియవు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. అయిదు నెలల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు.

ఉపముఖ్యమంత్రి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.   గూడెం గ్రామానికి విద్యుత్ లైను వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసిందని డిప్యూటీ సీఎంవో కార్యాలయం తెలిపింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులను ఉపయోగించి స్తంభాలు రవాణా చేయడం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలు పెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు. పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించారు.  తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. 

Related Post