బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల్లో తెరపడనుందనగా.. తీవ్రసంచలన ఘటన చో టు చేసుకుంది. ఎన్నికల సంరంభం ప్రారంభమైన తర్వాత.. అంతో ఇంతో ప్రశాంతంగానే పార్టీల ప్రచా రాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో వారంలోనే ఈ ప్రచారానికి తెరపడి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మద్దతు దారు.. ఆ పార్టీ అభ్యర్థి బంధువు దారుణ హత్యకు గురయ్యారు.
అది కూడా.. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. వేల మంది ప్రజలు హాజరైన సమయంలో శనివారం సాయంత్రం గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు.. జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒకరు.. తుపాకీతో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మొకామా నియోజకవర్గం జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి సొంత మామగారు, పీకేకు సలహాదారుగా, పార్టీలో కీలక రోల్ పోషిస్తున్న దులార్ చంద్ కు తూటా తగిలింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తులను అరెస్టు చేయగా.. మూలాలు బయటపడ్డాయి. ఇదే మొకామా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అధికార జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే ఆయనను ఆదివారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. తనకు పోటీ ఇస్తున్నందునే.. ఈ కాల్పులు జరిపించినట్టు సింగ్ పోలీసులు తెలిపారని సమాచారం.
రాజకీయం యూటర్న్..
తాజాగా జరిపిన కాల్పుల ఘటనతో ఇప్పటి వరకు.. ఉన్న రాజకీయ ప్రచారంలో యూటర్న్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జంగిల్ రాజ్ అంటూ.. ఆర్జేడీపై విమర్శలు గుప్పిస్తున్న జేడీయూ, బీజేపీలను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రశాంత్ కిశోర్ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. తాజా హత్య ఘటన అనంతరం.. ఎన్నికల సంఘం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కాగా, వచ్చే నెల 9, 11 న రెండు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.