గోవా వేదికగా మరో ఆధ్యాత్మిక అద్భుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దక్షిణ గోవాలోని ప్రసిద్ధ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన ఈ 77 అడుగుల కాంస్య విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) చెక్కిన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ చేతుల మీదుగానే ఈ రాముడి విగ్రహం కూడా రూపుదిద్దుకోవడం విశేషం.
ఈ మఠానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటైన ఈ సంస్థ, సారస్వత సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గోవాలోని పార్తగలి గ్రామంలో ఈ మఠం శాఖను ఏర్పాటు చేసి 370 ఏళ్లు అవుతోంది. ఈ వేడుకల్లో భాగంగానే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లి, ఆలయాన్ని సందర్శించి, ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 7 వేల నుంచి 10 వేల మంది భక్తులు మఠానికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక సేవలకు పెట్టింది పేరైన ఈ మఠం వేడుకల్లో పాల్గొనడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. రాముడి విగ్రహం ఆవిష్కరణతో గోవా పర్యాటకానికి ఆధ్యాత్మిక శోభ కూడా తోడైందని స్థానికులు సంబరపడుతున్నారు.
గోవా వెళ్లడానికి ముందు ప్రధాని కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించారు. అక్కడ శ్రీకృష్ణ మఠంలో జరిగిన ‘లక్ష కంఠ గీతా పారాయణం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, పండితులు, సాధారణ ప్రజలు కలిపి దాదాపు లక్ష మందితో కలిసి మోదీ భగవద్గీత శ్లోకాలను పఠించడం ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. ప్రపంచం మొత్తం భారత్ లోని దైవత్వాన్ని చూసిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.