ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ అనదగ్గ ఫ్యామిలీ మ్యాన్ నుంచి మూడో సీజన్.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీజన్-2 వచ్చిన నాలుగున్నరేళ్లకు పైగా గ్యాప్ తర్వాత మూడో సీజన్‌ను తీసుకొచ్చారు దర్శకులు రాజ్-డీకే. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఇది అంత థ్రిల్లింగ్‌గా లేదన్నది వాస్తవమే అయినా.. ఓవరాల్‌గా ఎంగేజింగే అన్నది టాక్. అమేజాన్ ప్రైమ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ భారీగా వ్యూయర్షిప్ను తెచ్చుకుంటోంది ఫ్యామిలీ మ్యాన్-3.
ఈ సిరీస్‌లో కొత్త పాత్రలు, ఆకర్షణలు చాలానే ఉన్నాయి. జైదీప్ ఆహ్లావత్, శ్రేయా ధన్వంతరి, నిమ్రత్ కౌర్ లాంటి కొత్త ఆర్టిస్టులు తమ పాత్రలకు ఆకర్షణ తెచ్చారు. వీరికి తోడు విజయ్ సేతుపతి, సందీప్ కిషన్, రాగ్ మయూర్ల క్యామియోలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా బండి మూవీతో తామే నటుడిగా పరిచయం చేసిన రాగ్ మయూర్‌తో రాజ్-డీకే చేయించిన క్యామియో తెలుగు ప్రేక్షకులకు భలే గమ్మత్తుగా అనిపిస్తోంది.
హిందీ వెర్షన్లో రాగ్ మయూర్‌తో రాజ్-డీకే తెలుగు డైలాగులు చెప్పించడం విశేషం. ట్రైన్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పేయి) ఫ్యామిలీ దగ్గరికి టీసీగా వస్తాడు రాగ్ మయూర్. సినిమా బండిలో అతను చేసిన మరిడేష్ బాబు పాత్ర పేరునే ఇక్కడ వాడుకోవడం విశేషం. జేకే తల్పాడే పాత్రధారి తన పేరును ఆంజనేయులు అని, తమది చిత్తూరు అని పరిచయం చేసుకుంటే.. మీది చిత్తూరా అంటూ ఆశ్చర్యపోయి తెలుగులో మాట్లాడతాడు మరిడేష్ బాబు.
చిత్తూరులో ఎక్కడ అని అడిగితే.. గాంధీ రోడ్డా అంటూ మాట కలుపుతాడు. అసలు తెలుగే తెలియని జేకే.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తటపటాయించే సీన్ హిలేరియస్‌గా సాగింది. దర్శకులు రాజ్-డీకే పర్టికులర్‌గా చిత్తూరు గురించి సీన్ పెట్టి తెలుగు డైలాగులు పెట్టడం వెనుక కారణముంది. వీళ్లిద్దరూ చిత్తూరుకు చెందిన వాళ్లే. అలాంటి టౌన్ నుంచి వెళ్లి బాలీవుడ్లో జెండా ఎగురవేసి.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్ల జాబితాలో చోటు సంపాదించడం విశేషం.