కోలీవుడ్ లోనే కాదు తెలుగు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన విషయం దర్శకుడు సుందర్ సి రజనీకాంత్ సినిమాని వదులుకోవడం. అట్టహాసంగా మొదలుపెట్టి మీడియాకు ఫోటోలు, వీడియోలు ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం సూపర్ స్టార్ కెరీర్ లో చాలా అరుదని చెప్పాలి. దీనికి కారణాలు ఏంటయ్యా అంటే చెన్నై వర్గాల టాక్ ఇలా ఉంది. వాటిలో మొదటిది సుందర్ చెప్పిన స్టోరీ లైన్ రజనికి నచ్చకపోవడం. హారర్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ టచ్ ఉన్న ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ సుందర్ రాసుకున్నాడట. కానీ రజనీకి అది వర్కౌట్ కాదని భావించి వేరేది అడిగారట.
దీంతో అదేదో అవమానంగా ఫీలైన సుందర్ ఏకంగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కమల్ హాసన్ ని సంప్రదించకుండానే ఓపెన్ లెటర్ విడుదల చేసినట్టు ఒక న్యూస్ అయితే ఉంది. ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కమల్ హాసన్ వేరే దర్శకుడి కోసం చూస్తున్నామని చెప్పారు తప్పించి కారణాలు ఏంటో వివరించలేదు. సుందరే చెప్పాక నేను చెప్పేది ఏం లేదనే ధోరణిలో ఆయన సమాధానం ఉంది. అయినా సుందర్ కు ఈ దెయ్యాల ఫాంటసీ ఏంటో అర్థం కావడం లేదు. అరణ్మయి హిట్టయినప్పటి నుంచి ఆ ఫార్ములాని వదలడం లేదు.
ఇప్పుడు రజనికు కూడా అదే చెప్పాలనుకోవడం కామెడీ. చంద్రముఖి తర్వాత రజనీకాంత్ హారర్ జానర్ టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు చెబుతారు. ఎందుకంటే దీని కన్నడ వెర్షన్ ఆప్తమిత్రలో చేసిన విష్ణువర్ధన్, సొందర్యలు ఈ లోకం విడిచి వెళ్లిపోవడాన్ని ఆయన ఎందుకో పెర్సనల్ గా ఫీలయ్యారట. ఒరిజినల్ మలయాళ వర్షన్ మనిచిత్రతజులో చేసిన వాళ్లకు ఏం కాకపోయినా ఈ ఫార్ములా వద్దని ఫిక్స్ అయ్యారట. సుందర్ సి ప్రస్తుతం మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి) తో బిజీగా ఉన్నారు. నయనతార టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీకి వంద కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు.