ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరుకాబోతోన్న ఈ సదస్సు పనులను మంత్రి లోకేశ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ పనుల్లో ఇంత బిజీగా ఉన్నప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తల సంక్షేమానికి లోకేశ్ సమయం కేటాయిస్తున్నారు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులను దగదర్తిలో లోకేశ్ పరామర్శించారు.
సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీతో పాటు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని లోకేశ్ హామీనిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు సుబ్బానాయుడు అన్నారని, తనతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ 135 కోట్లు ఖర్చుపెట్టిందని తెలిపారు.
ఫ్యాక్షన్ దాడుల్లో చనిపోయిన టీడీపీ కార్యకర్తల పిల్లలు మళ్లీ ఫ్యాక్షన్ వైపు వెళ్లకూడదని, వారి సంక్షేమం కోసం హైదరాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యను అందించామని అన్నారు.
టీడీపీకి కార్యకర్తలే బలం అని, కార్యకర్తలే పార్టీ అధినేతలని నాడూ చెప్పామని, ఈనాడూ చెబుతున్నామని లోకేశ్ అన్నారు. పసుపు జెండా చూస్తేనే కార్యకర్తలకు ఒక ఎమోషన్ అని, కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా నిలబడతామని చెప్పారు.
దగదర్తి వెళ్లే క్రమంలో లోకేశ్‌కు ఒంగోలులో ఘన స్వాగతం లభించింది. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో లోకేశ్‌ను సత్కరించారు. అక్కడ లోకేశ్ రోడ్‌షోకు వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.