తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను ఆ పనిచేస్తే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమో.. ఆ విషయమే ఆలోచిస్తున్నా“ అని అన్నారు. జాగృతి జనం యాత్ర నిర్వహిస్తున్న కవిత .. తాజాగా శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు.
చెరువులను ఆక్రమించి పెద్ద ఎత్తున భవనాలు నిర్మించుకుంటున్నారని కవిత ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు. వీటిపై హైడ్రా ఏం చేస్తోందని ప్రశ్నించారు. పేదలకు చెందిన ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రాకు ఇవన్నీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అయితే.. తప్పులు చేసిన వారు అధికార పార్టీలో చేరిపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రా మౌనంగా చూస్తూ కూర్చుందని కవిత విమర్శించారు.
తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు సమర్పిస్తానని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తానని కవిత చెప్పారు. “అయితే..ఇక్కడో సమస్య ఉంది. నేను ఆధారాలతో సహా హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది. ఇక, వారికి క్లీన్ చిట్ వస్తుంది. ఎంత మందిని చూడడం లేదు“ అని కవిత వ్యాఖ్యానించారు. అయితే.. నియోజకవర్గంలో తన అనుచరులే భూములను, చెరువులను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుంటున్నా.. మాజీ మంత్రి సబిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల, మంత్రాల చెరువులలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడు తున్నారని కవిత తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. “నాకు ఉన్న సమాచారం మేరకు.. ఇద్దరు నుంచి ముగ్గురువరకు.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఎవరి సేఫ్ వారు చూసుకుంటున్నారు.“ అని కవిత చెప్పారు. కాగా.. ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చసాగుతుండడం గమనార్హం.