హైదరాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రేపు రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీకి బీసీ డిమాండ్లపై శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులగనన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని, ఆచరణలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్ గా చేయాలని ఆయన కోరారు. అతి త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బీసీకి, రెండవది ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధం లేని వారిని, ఇప్పటికే తమ జనాభా దామాషా కంటే ప్రాతినిధ్యం ఎక్కువగా రాజకీయంగా ఉన్న అగ్రకులాలకు అవకాశం ఇవ్వకుండా బీసీలకే ఇవ్వాలని కోరారు
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, రాష్ట్ర బడ్జెట్ లో, అన్ని స్థాయిలోనూ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు . రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించే పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆదేశించాలని అన్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల ఆధిపత్య వర్గాల దాడిలో రెండు నెలల పసికందు మరణించిన విషయంలో రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, బీసీ కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బీసీలకు కూడా బీసీ రక్షణ చట్టం తీసుకు రావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు
రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా ఉన్న బీసీల ఆకాంక్షలను గౌరవించక పోతే, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి జాబితాల ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా చేరుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు .
The post బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి
Categories: