కొత్త సినిమాలను పైరసీ చేస్తూ వందల కోట్ల నష్టాన్ని టాలీవుడ్ కు కలుగజేసిన ఐబొమ్మ ఓనర్ ఇమ్మిడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీని మీద మూవీ లవర్స్ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేయగా సదరు రవి మీద సానుభూతి చూపిస్తున్న వాళ్ళు తక్కువేం లేరు. అభివన రాబిన్ హుడ్ గా, టికెట్ రేట్లు పెంచుతున్న నిర్మాతల నుంచి తమను కాపాడుతున్న కొండవీటి దొంగగా ఓ రేంజ్ లో వర్ణిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ప్రస్తుతం ఈ డిబేట్ సోషల్ మీడియాలో బాగానే జరుగుతోంది. ఎవరు ఏమన్నా సదరు ఇమ్మడి రవి కటకటాల పాలు రావడం ముమ్మాటికీ రైటే.
దీంతో పైరసీ పూర్తిగా అంతరించిపోయినట్టేనా అంటే కాదని చెప్పాలి. ప్రస్తుతం చెట్టులో ఒక ముఖ్యమైన కొమ్మ విరిగింది. ఇంకా అసలు దొంగలు చాలానే ఉన్నారు. ఏ దేశాల్లో దాక్కున్నారో తెలిసేంత వరకు ఈ భూతం ఇంకా చావనట్టే. అయితే ఇమ్మడి రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కొందరు దర్శక రచయితలు సినిమాలు వెబ్ సిరీస్ లు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమో కాదో కానీ ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. భార్య, అత్త చేతిలో అవమానానికి గురై అతను ఇలా అడ్డదారిలో కోట్లు సంపాదించి ఉండొచ్చు. అంత మాత్రాన బయోపిక్ తీయాలనుకోవడం తప్పే.
రిమాండ్ కు వెళ్లిపోయిన అతని గురించి పదే పదే ట్వీట్ల ద్వారా చర్చకు తేవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఈ వ్యవహారం మీద ఏ మాత్రం ఐడియా లేనివాళ్లకు అతనో హీరోలా కనిపించొచ్చు. పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా పరిణమించిన ఇమ్మడి రవి లాంటి వాళ్ళను హైలైట్ చేయడం మూర్ఖత్వం. ఇక్కడ కూడా ప్రస్తావించడానికి కారణం అవసరానికి మించి అతని గురించి డిస్కషన్లు పెట్టడం రాంగని చెప్పేందుకే. రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నేరం రుజువైతే కోర్టు ఏ శిక్ష విధిస్తుందో చూడాలి. ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి జైల్లో ఎక్కువ కాలం మగ్గక తప్పదు.