దురంధర్ ది రివెంజ్ సినిమాలో పాత్రలు, ట్విస్టుల గురించి డిస్కషన్లు, ఎలివేషన్లు చేసుకుని అలిసిపోయిన మూవీ లవర్స్ కు ఆ సినిమాలో ఉన్న గొప్ప సంగీతం ఏంటో మెల్లగా అర్థమవుతోంది. శాశ్వత్ సచ్ దేవ్ కంపోజ్ చేసిన పాటల్లో కమర్షియల్ హంగులు లేకపోయినా వెంటాడే రీతిలో ఇచ్చిన ట్యూన్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘జాయే సజనా’ సాంగ్ ఊపేస్తోంది. దీని లైవ్ కన్సర్ట్ వీడియో తెగ తిరుగుతోంది.
పంజాబీ గాయని జాస్మిన్ సండ్లాస్ గాత్రం నిజంగా మేజిక్ చేసేలా ఉంది. హై పిచ్ లో మెలోడీ మిస్ కాకుండా బాధను వ్యక్తపరిచే సాహిత్యాన్ని ఆలపించిన తీరు అద్భుతంగా కుదిరింది. తోటి గాయకుడు సతిందర్ సర్తాజ్ తో కలిసి లిరిక్స్ కూడా వీళ్ళే స్వంతంగా సమకూర్చుకోవడం విశేషం. దురంధర్ ది రివెంజ్ లో ఒక కీలక సందర్భంలో వచ్చే ఈ గీతం స్క్రీన్ మీద కన్నా బయట విని చూస్తున్నప్పుడే గొప్పగా కనెక్ట్ అవుతోంది.
‘ఆరి ఆరి’ పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయిపోయింది. వెనుక పటాసుల చక్రం తిరుగుతూ ఉండగా రణ్వీర్ సింగ్ తుపాకీ పట్టుకుని చేసే విధ్వంసానికి ఎంత రచ్చ జరిగిందో థియేటర్లలో చూశాం. మిగిలిన మూడు సాంగ్స్ కూడా దేనికవే నువ్వా నేనా అనేలా ఉన్నాయి. సంగీత ప్రియులు డిమాండ్ చేస్తున్న అంశం మరొకటి ఉంది. దురంధర్ లో వాడిన పాత పాటల రీమిక్స్ సాంగ్స్ ని కోరుతున్నారు. కానీ కాపీ రైట్ వల్ల ఆ వర్షన్లను ప్రస్తుతానికి రిలీజ్ చేయలేకపోతున్నారు.
దీని సంగతలా ఉంచితే దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ దండయాత్ర సోమవారం కూడా కొనసాగుతోంది. వెయ్యి కోట్ల వైపు వేగంగా పరుగులు పెడుతున్న ఈ స్పై డ్రామా రెండో వారం మొదలయ్యేలోపే ఆ లాంఛనం పూర్తి చేసుకునేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్ము దులిపేస్తున్న దురంధర్ దెబ్బకు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా సైడ్ అవ్వాల్సి వస్తోంది. టాక్ తేడాగా ఉండటంతో పాటు రణ్వీర్ సింగ్ మూవీకు వచ్చిన యునానిమస్ టాక్ పవన్ సినిమా మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం.