hyderabadupdates.com movies మంచి స్పీడు మీదున్న మురారి

మంచి స్పీడు మీదున్న మురారి

పది రోజుల కిందట పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైంది ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి రేసులో చివరగా బరిలోకి దిగిన ఈ చిత్రం గురించి రిలీజ్ ముంగిట పెద్దగా డిస్కషనే లేదు. ఇంత పోటీలో ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారు.. దీనికసలు బజ్‌యే లేదు కదా.. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వా ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

పైగా ఈ చిత్రానికి సరిపడా థియేటర్లు కూడా దొరకలేదు. మిగతా సంక్రాంతి సినిమాలన్నింటి కంటే అతి తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ కంటెంట్ ఉంటే.. బజ్ దానంతట అదే వస్తుందని.. ప్రేక్షకులు వెతుక్కుని మరీ సినిమా చూస్తారని.. స్క్రీన్లు, షోలు ఆటోమేటిగ్గా పెరుగుతాయని ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా రుజువు చేసింది.

చిన్న సినిమాగా మొదలై.. పెద్ద రేంజికి వెళ్తోందీ చిత్రం.వారం ముందు మిగతా ఏ సంక్రాంతి సినిమాతో పోల్చుకున్నా.. సగానికి మించి షోలు కనిపించేవి కావు ‘నారీ నారీ నడుమ మురారి’కి. ఉన్న స్క్రీన్లలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయిందా చిత్రం. డిమాండుకు తగ్గ స్క్రీన్లు లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమా చూడలేకపోయారు కూడా.

కానీ లాస్ట్ వీకెండ్ అయ్యాక రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలకు జనం కరవయ్యారు. దీంతో ఆ సినిమాలకు స్క్రీన్లు తీసేసి.. శర్వా సినిమాకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ వీకెండ్లో చూస్తే హైదరాబాద్‌లో రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి రెండు చిత్రాలకూ కలిపి ఉన్న షోలను మించి ‘నారీ నారీ నడుమ మురారి’ షోలు కనిపిస్తున్నాయి.

కంటెంట్ పవర్ ఏంటో చెప్పడానికి ఇది రుజువు. శర్వా సినిమాకు బుకింగ్స్ కూడా బాగున్నాయి. మరోవైపు చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుండగా.. నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడుతోంది.

Related Post