మన దగ్గర చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం వరకే పరిమితమయ్యింది కానీ, నాలుగు దశాబ్దాలు దాటినా ఆ కల మాత్రం నెరవేరలేదు. స్టేజిల మీద ఇద్దరూ పరస్పరం ఈ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నప్పటికీ సరైన కథతో ఏ దర్శకుడు రాలేకపోతున్నారు. ఈ కోణంలో చూసుకుంటే మలయాళం మూవీ లవర్స్ లక్కీ అని చెప్పొచ్చు. ఇప్పుడీ డిస్కషన్ కు కారణం పాట్రియాట్ అనే మల్టీస్టారర్ మూవీ.
ఏప్రిల్ 23 విడుదల కావాల్సిన ఈ మూవీలో మమ్ముట్టి, మోహన్ లాల్ నటించారు. ఎన్నో ఏళ్ళ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అభిమానుల ఉద్వేగం ఓ స్థాయిలో ఉంది. అంతే కాదు ఫహద్ ఫాసిల్, నయనతార, కుంచకో బోబన్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఇందులో భాగమయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దర్శకుడు మహేష్ నారాయణన్ గతంలో టేకాఫ్, సీ యు సూన్ లాంటి విలక్షణమైన చిత్రాలు అందించారు. తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసేందుకు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు.
అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడం మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నిర్మాత యాంటో జోసెఫ్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర రెవిన్యూ షేరింగ్ మీద ఒక మెలిక పెట్టాడట. మొదటి రెండు వారాలు వచ్చే కలెక్షన్లలో తనకు 60 శాతం ఇచ్చి మిగిలిన 40 శాతం ఎగ్జిబిటర్లను తీసుకోమన్నాడని కోచి టాక్. దీని మీద పంపిణీదారులు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని సమాచారం.
గతంలో ఉన్న పద్దతి ఏంటంటే మొదటి వారం 60:40, రెండో వారం 55:45 ఉంటుంది. కానీ ఇప్పుడు జోసెఫ్ ఏకంగా టూ వీక్స్ కి ఒకటే పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఇలా అయితే తమకు ఏం మిగలదని ట్రేడ్ అంటోంది. ఒకవేళ సినిమా కనక ఏ మాత్రం అటు ఇటు అయి యావరేజ్ అయినా తీవ్రంగా నష్టపోయేది తామేనని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది కొలిక్కి వస్తే తప్ప పాట్రియాట్ ని థియేటర్లలో రిలీజ్ చేయలేరు. ఇంకా నలభై అయిదు రోజుల సమయం ఉంది కాబట్టి పరిష్కారం దొరికే అవకాశం లేకపోలేదు.