మహాసేన రాజేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. యూట్యూబర్‌గా ప్రారంభమైన రాజేష్ ప్రస్థానం తర్వాత కాలంలో రాజకీయాల వైపు మళ్ళింది. ముఖ్యంగా టిడిపిని సమర్ధించే వ్యక్తుల్లో రాజేష్ ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా భావించారు. టికెట్ కూడా ఖరారు అయినట్టు చర్చ కూడా నడిచింది.
కానీ, అనూహ్యంగా ఒక వర్గం ఆయనను తీవ్రంగా విమర్శించడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఫలితంగా గత ఎన్నికల్లో చిట్టచివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న ఏకైక నాయకుడిగా మహాసేన రాజేష్ నిలిచారు. అయినప్పటికీ తరచుగా యూట్యూబ్ ద్వారా వైసీపీ విధానాలను ఎండగడుతున్నారు. టిడిపి తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఇటీవల ప్రకటించిన కమిటీలలో మహాసేన రాజేష్ కు బలమైన పదవి దక్కుతుందని ఆయన అంచనా వేసుకున్నారు.
దీనికి సంబంధించి కూడా యూట్యూబ్‌లో ఒక ప్రకటన చేశారు. పార్టీలో తనకు గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నట్టు రెండు రోజులు ముందు చెప్పారు. కానీ ఆయన ఏ ఆశించారో తెలియకపోయినా పార్టీ మాత్రం మహాసేన రాజేష్ కు పార్టీ పదవుల్లో అవకాశం కల్పించలేదు. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని అదేవిధంగా ఎస్సీల్లోని ఇతర నాయకులకు అవకాశం ఇచ్చారు. ఈ వ్యవహారంతో మహాసేన రాజేష్ తీవ్రంగా ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది.
అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ఖాయమని అందుకే ఇప్పుడు పదవులు ఇవ్వలేదని ఒక వర్గం చెబుతోంది. మహాసేన రాజేష్ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నప్పటికీ ఆయనపై ఒక సామాజిక వర్గం ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలోనే కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని మరో వర్గం చెబుతోంది. ఈ పరిణామాలతో ప్రస్తుతం మహాసేన రాజేష్ కు పార్టీలో అవకాశం చిక్కలేదని అంటున్నారు.
కానీ పార్టీ మహాసేన రాజేష్ ని వదులుకోదని ఆయన సేవలను వినియోగించుకుంటుందని సీనియర్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇటు తిరువూరు కానీ అటు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కానీ కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.