ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ మార్గంలో దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే దాదాపు అమలు చేసిన కూటమి సర్కారు…ఇప్పుడు హామీగా ఇవ్వని చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి ద్వారా పేదలకు మరింత మేర లబ్ధి జరిగేలా చేస్తోంది. అందులో భాగంగా కూటమి సర్కారు రథసారథి, సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు రెండు అదిరిపోయే పథకాలకు రూపకల్పన చేశారు. ఈ డబుల్ బొనాంజాకు బాబు ఇప్పటికే ఆమోద ముద్ర వేయగా… అతి త్వరలోనే ఈ పథకాల ప్రకటన ఉండనుంది.
బాబు ఆమోద ముద్ర వేసిన రెండు కొత్త పథకాల విషయానికి వస్తే… మొదటి దాని పేరు ఎన్టీఆర్ విద్యా లక్ష్మీ, రెండో పథకం పేరు ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి. ఈ రెండు పథకాల కింద పావలా వడ్డీకే రూ.1లక్ష రుణం చొప్పున అందిస్తారు. అది కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధి కింద కార్యకలాపాలు సాగిస్తున్న స్త్రీ నిధి బ్యాంకు ఈ రుణాలను అందిస్తారు. ఈ రుణాలతో తమ పిల్లల చదువు, వివాహం చేసే విషయంలో పేద మహిళలకు భారీ ఊరట లభించినట్టే. కళాశాల ఫీజు చెల్లించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం వారికి ఉండదు. ఇక ఆడ బిడ్డల వివాహం విషయంలోనూ పావలా వడ్డీకే రూ.1 లక్ష లభిస్తుండటం కూడా పేద మహిళలకు ఎంతో ఉపశమనం లభించినట్టేనని చెప్పాలి.
వాస్తవానికి పదో తరగతి దాకా పేదల పిల్లలు స్కూలుకు వెళుతున్నా… కళాశాల విద్యకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది పేద పిల్లలు ఇంటర్ లో చేరలేకపోతున్నారు. ఏటేటా పెరుగుతున్న డ్రాపౌట్సే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే… డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళ కూడా తమ పిల్లలను ఇంటర్ ఆ పై స్థాయి చదువులను కూడా చదివిస్తుందని చెప్పక తప్పదు.
ఇక ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం విషయానికి వస్తే… డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తమ ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే నానా తంటాలు పడుతున్నారు. దొరికిన చోట అధిక వడ్డీ రేట్లకు అయినా అప్పు చేసి మరీ పెళ్లి చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాబు ప్రకటించే పథకంతో ఆ మహిళా కుటుంబాలకు భారీ ఊరట లబించినట్టేనని చెప్పాలి. పావలా వడ్డీకే రూ.1 లక్ష లభిస్తే… పెళ్లి ఏర్పాట్లను, ఇతరత్రా సామాగ్రిని ముందుగానే కొనుగోలు చేసుకుని ఒకింత తీరుబాటుగా వివాహాలు చేసే అవకాశాలు వారికి లభించనున్నాయి. ఈ రెండు పథకాల ప్రకటన తర్వాత ఓ వైపు కూటమి ప్రతిష్ఠ, మరోవైపు బాబు ఇమేజీ అమాంతం పెరగడం ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి.