తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టే ప్రతి పరభాషా నటుడు, టెక్నీషియన్ చెప్పే మాట ఒక్కటే. తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఉన్నంత ప్రేమ అసాధారణం.. వాళ్లను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అనే. ఈ మధ్య ఇది ఒక టెంప్లేట్ డైలాగ్‌లా మారిపోయింది. ఐతే చాలామంది తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మొక్కుబడిగానే ఈ మాట అంటుంటారు.
కానీ దుల్కర్ సల్మాన్ ఆ కోవకు చెందిన వాడు కాదు. అతను ఏం మాట్లాడినా నిజాయితీగా ఉంటుంది. అతనెంత సిన్సియర్‌గా సినిమాలు చేస్తాడో తెలిసిందే. అంతే కాక తెలుగు చిత్రాలకు అతను ఇచ్చే ప్రాముఖ్యత ఎలాంటిదో కూడా అందరికీ అవగాహన ఉంది. తాజాగా అతను తమ సొంత వాళ్లయిన మలయాళ ప్రేక్షకులతో పోల్చి తెలుగు ఆడియన్స్ గొప్పదనం గురించి ఎలివేషన్ ఇచ్చాడు.
మలయాళంలో తనే కాక ఏ నటుడు అయినా ఒక రెండేళ్లు సినిమాలు చేయలేదంటే అతడి కథ ముగిసిందని.. సినిమాల నుంచి ఔట్ అని ఒక తీర్మానానికి వచ్చేస్తారని దుల్కర్ చెప్పాడు. తనకు కూడా ఆ అనుభవం ఎదురైందన్నాడు. కానీ తెలుగు ప్రేక్షకులు అలా కాదని దుల్కర్ చెప్పాడు. ఇలా అనుకోకుండా ఏ నటుడి కెరీర్లో అయినా గ్యాప్ వచ్చిందంటే.. ఎందుకు సినిమాలు చేయట్లేదు అని అడిగి, వాళ్లు మళ్లీ యాక్టివ్ అయ్యేలా ప్రోత్సహిస్తారని దుల్కర్ తెలిపాడు.
రానా దగ్గుబాటి కెరీర్లో ఇలాగే గ్యాప్ వస్తే.. మళ్లీ సినిమాలు చేయొచ్చు కదా, ఎందుకిలా గ్యాప్ తీసుకుంటున్నారు అని ప్రేక్షకులు తన వెంటపడడం తాను చూశానన్నాడు. ఇలాంటి ప్రేక్షకులు ఇంకెక్కడా ఉండరని.. తెలుగు వాళ్ల సినిమా ప్రేమ అసాధారణమైందని దుల్కర్ కొనియాడాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనుసు దోచిన దుల్కర్.. ఇప్పుడు ‘కాంత’తో బాక్సాఫీస్ బరిలో నిలిచాడు. ఈ చిత్రం శుక్రవారమే రిలీజవుతోంది. ఇందులో రానా కూడా నటించాడు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా రానా, దుల్కర్‌లే కావడం విశేషం.