వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ కూటమి పార్టీలకు ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో తెరమీదికి వచ్చిన.. నకిలీ మద్యం కుంభకోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇద్దరు కీలక నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరింత మంది ప్రమేయం ఉందన్న అధికారుల వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఎంపీ మిథున్ రెడ్డి నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ.. తంబళ్లపల్లి సహా.. ఎన్టీఆర్, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనూ వెలుగు చూసిన.. నకిలీ మద్యం కేసుల వివరాలతో 12 పేజీల నివేదికను కేంద్ర హోం శాఖకు పంపించా రు. తక్షణమే ఈ వ్యవహారంపై సిబీఐ ని వేయాలని.. నిజానిజాలు వెలికి తీయాలని మిథున్ రెడ్డి కోరారు. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే.. ఇలా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నాయకులను తమ దారిలో కి తెచ్చుకుని.. ప్రభు త్వ దూకుడుకు, వైసీపీ నేతలపై నమోదు చేస్తున్న కేసులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది జరుగుతుందా? మిథున్ రెడ్డి అభ్యర్థనను కేంద్రం ఏమేరకు పరిశీలిస్తుంది? అనేది చూడాలి. అయితే… ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వంపై కేంద్రం సానుకూలంగానే ఉన్నదరిమిలా.. సీబీఐ విషయంలో కేంద్రం మౌనంగా ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే.. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వైసీపీహయాం నాటి మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం తెరమీదకి తెచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా.. దీనిపైనా సీబీఐని వేయాలని ఇప్పటికే కోరిన దరిమిలా.. మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందని పరిశీల కులు చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే ఈ విషయాన్ని సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా.. కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక నకిలీ మద్యం కుంభకోణంపై పట్టుబడితే.. తాము కూడా వైసీపీ మద్యం కుంభకోణంపై పట్టుబడతామని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.