రాజకీయాల గురించి సీనియర్ మోస్ట్ నాయకుడు.. తెలంగాణ కాంగ్రెస్ నేత.. జగ్గారెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన అన్నీ తెలిసి కూడా.. ఆయన ఇటీవల కాలంలో ఫ్రెస్ట్రేషన్‌కు గురవుతున్నారు. తాజాగా తన సొంత నియోజకవర్గంలోని మేధావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2023 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. అనేక ఎన్నికలను చూసిన జగ్గారెడ్డికి.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమనే విజయం తెలియంది కాదు.
పైగా గత ఎన్నికలు జరిగి… రెండేళ్లు అయిపోయింది. అయితే.. జగ్గారెడ్డి తన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. తనలోని బాధను దిగమింగుకోలేక పోతున్నారన్నది స్పష్టమవుతోంది. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలుచేసే జగ్గారెడ్డి.. తాజాగా సంగారెడ్డి నుంచి తాను జీవితంలో పోటీ చేయనని శపథంచేశారు. అంతేకాదు.. తన భార్య పోటీ చేసినా.. కూడా తాను ప్రచారం చేయ నని అన్నారు. దీనికి కారణం.. గత ఎన్నికలలో తనను ఓడించమేనన్న విషయాన్ని ఆయన ఎలాంటి దాపరికం లేకుండానే కుండబద్దలు కొట్టారు.
“సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఇక జీవితంలో పోటీ చేయను. సంగారెడ్డిలో నా భార్య నిర్మల పోటీ చేసినా.. నేను ప్రచారానికి రాను. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాకానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయను. జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసినా నన్ను ఇక్కడివారు ఓడించారు. నా ఓటమికి పేదలు కారణం కాదు. ఇక్కడి మేధావులు, పెద్దలే కారణం.. ఈవిషయం నాకు తెలుసు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేను“ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే.. వాస్తవానికి ఇందిరమ్మ వంటి వారే ప్రత్యక్ష ఎన్నికల్లో పరిస్థితులు సరిపోక ఓడిన సందర్భాలు ఉన్నాయి. అన్న ఎన్టీఆర్ కూడా ఒక నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. అంతెందుకు.. చిరంజీవి కూడా పాలకొల్లులో పరాజయం పాలయ్యారు. ఇక, పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
అంతేకాదు.. జగ్గారెడ్డి చెబుతున్న రాహుల్‌గాంధీ కూడా..తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి.. వేరే చోట విజయం దక్కించుకున్నారు. ఇలా.. అనేక మంది ఉన్నారు. ఈ విషయాలు జగ్గారెడ్డికి తెలియవా? కానీ.. ఆయనలో అసంతృప్తి పేరుకుపోయింది. ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని.. కనీసం నామినేటెడ్ పదవిని కూడా ఇవ్వడం లేదని బాధ ఉంది. ఇదే.. పరోక్షంగా ఇలా పెల్లుబుకుతోందన్నది వాస్తవం.