వారణాసి సినిమా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ సందర్భంగా హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు ఆయనపై కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టాలీవుడ్ నటుడు శివాజీ తీవ్రంగా స్పందించారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై కేసు కూడా పెట్టారని శివాజీ అన్నారు. అయితే, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి గురించి మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని శివాజీ ప్రశ్నించారు.
తమ స్వలాభం కోసం లడ్డూ కల్తీ వంటి విషయాలపై వారు మాట్లాడరని శివాజీ మండిపడ్డారు. ఇది ప్రజల సమస్య కాదని, వారి మనోభావాలు దెబ్బతినవని ఎద్దేవా చేశారు. తిరుమల వెంకన్న స్వామికి ఐదేళ్ల పాటు అన్యాయం జరిగిందని, కానీ, దానిపై మాట్లాడాలంటే సోకాల్డ్ మనుషులకు భయమని విమర్శించారు. మనమంతా కుళ్లిపోయిన వ్యవస్థలోనే బ్రతుకుతున్నామని, ఈ విషయం జెన్ జెడ్ పిల్లలు గ్రహించాలని అన్నారు. ఆ తరం వాళ్లయినా సమాజంలో మార్పు తేవాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ రోజు ఈ విషయాలపై మాట్లాడుతున్నానని శివాజీ అన్నారు.
హనుమంతుడిపై రాజమౌళి చేసిన కామెంట్లను శివాజీ సమర్థించలేదు. ఆ కామెంట్ల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే, తాను వారిని తప్పుబట్టడం లేదని క్లారిటీనిచ్చారు. కానీ, రాజమౌళిపై కేసు పెట్టి, ఆయనపై విమర్శలు చేస్తున్న వ్యక్తులు…తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయంపై ఏమీ మాట్లాడకపోవడంపైనే తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.