ఒకప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. 90వ దశకంలో అంకుశం, అల్లరి మగాడు, ప్రియుడు లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అభిమానులు యాంగ్రీ యంగ్‌మ్యాన్ అని పిలుచుకునే ఈ సీనియర్ హీరో. ఐతే చాలామంది సీనియర్ హీరోల్లాగే ఒక దశ దాటాక సరైన విజయాలు లేక ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో ఆయన పూర్తిగా కనుమరుగు అయిపోయారు. ఆ దశలో గరుడ వేగ సినిమాతో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేసినా.. తర్వాతి చిత్రాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి.
రెండేళ్ల కిందట రాజశేఖర్.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రంగప్రవేశం చేశారు. నితిన్ సినిమా ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌లో ప్రత్యేక పాత్ర చేశారు. కానీ అది డిజాస్టర్ కావడం వల్ల రాజశేఖర్ గురించి చర్చ జరగలేదు. కానీ కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు శర్వానంద్ మూవీ బైకర్‌లో మరోసారి క్యారెక్టర్ రోల్‌తో పలకరించబోతున్నాడు రాజశేఖర్. ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా రాజశేఖర్ ఒక ఆశ్చర్యపరిచే విషయం చెప్పారు.
తాను చాలా ఏళ్లుగా ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధ పడుతున్నట్లు రాజశేఖర్ చెప్పారు. దీని వల్ల కడుపు నొప్పితో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మెదడు, కండరాల మీద కూడా ప్రభావం ఉంటుంది. తాను ఎప్పట్నుంచో ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నానని.. బైకర్ టీజర్ ఈవెంట్లో తాను స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుందని దర్శకుడు చెప్పడంతో కంగారు పడ్డానని.. ఏదేదో మాట్లాడేస్తానని అనుకున్నానని రాజశేఖర్ అన్నాడు. ఖాళీగా ఉండడం తనకు నచ్చదని… పని లేకుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుందని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
బైకర్ మూవీ షూట్ కోసం వేరే దేశానికి వెళ్లినపుడు ఒక ఫొటోగ్రాఫర్‌ను పెట్టుకున్నామని.. అతను తనతో మాట్లాడుతున్నపుడు, చేస్తున్న సినిమాల గురించి అడిగాడని.. తన కమిట్మెంట్స్ చెప్పానని.. ఈ వయసులోనూ మీ చేతిలో ఇంత పని ఉండడం చాలా లక్కీ అని చెప్పాడని.. అప్పుడా విషయం పట్టించుకోకపోయినా, తర్వాత ఆలోచిస్తే నిజమే కదా అనిపించిందని రాజశేఖర్ చెప్పాడు. కరోనా టైంలో తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డానని.. మూడు నెలల పాటు ఒక అడుగు కూడా వేయలేకపోయానని.. కోలుకున్నాక సినిమా చేయడం కోసం చాలా కథలు విన్నా నచ్చలేదని.. బైకర్ తాను ఎంతో ఇష్టంతో చేసిన సినిమా అని రాజశేఖర్ చెప్పాడు.