hyderabadupdates.com movies రామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారో

రామ్-లక్ష్మణ్ మాస్టర్స్… ఎంత బాగా చెప్పారో

ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే.. ఎప్పటికీ హవా సాగించలేరు. ఏదో ఒక సమయంలో జోరు తగ్గుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాకపోవడం వల్లో, కాలం కలిసి రాకో అవకాశాలు తగ్గుతాయి. ఆదరణ కోల్పోతారు. కానీ తాము నిష్క్రమించాల్సిన సమయం వచ్చినపుడు దాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పదు. అపజయాలు ఎదురైనా, అవకాశాలు తగ్గినా ప్రయాణం ఆపడానికి ఇష్టపడరు. ఎంతో మంది లెజెండ్స్ ఈ విషయాన్ని గ్రహించలేక ఎదురు దెబ్బలు తిన్నవాళ్లే. 

చాలా కొద్ది మంది మాత్రమే ఇక చాలు అని.. తమ టైం ముగియడానికి ముందే నిష్క్రమిస్తారు. తెలుగులో లెజెండరీ ఫైట్ మాస్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ లక్ష్మణ్ మాత్రం.. ఎప్పుడైనా సరే తమ ప్రయాణాన్ని ఆపేయడానికి సిద్ధం అంటున్నారు. తమ పని నచ్చలేదని, తాము అప్డేట్ కాలేదని అనిపిస్తే.. నేరుగా తమకు ఆ విషయం చెప్పొచ్చని.. తాము తమ వర్క్ ఆపేస్తామని ఒక ఇంటర్వ్యూలో ఈ కవల సోదరులు స్పష్టంగా చెప్పారు.

ఇండస్ట్రీలో తమ ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తయ్యాయని.. ఇప్పుడు తామిద్దరం దైవచింతనతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నామని రామ్, లక్ష్మణ్ తెలిపారు. తమ కెరీర్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామని.. జయాల కంటే అపజయాలు ఎక్కువగానే ఎదుర్కొన్నామని ఈ ఫైట్ మాస్టర్స్ చెప్పారు. ఐతే ఓటమి ఎదురైందని ఎప్పుడూ బాధ పడలేదని.. ధైర్యంగా అడుగు ముందుకు వేశామని అన్నారు. 

ఇక వర్తమానం, భవిష్యత్ గురించి మాట్లాడుతూ.. తామిద్దరం ఎంతో సాధించామని.. తమకు ఉన్నదాంతో చాలా హ్యాపీగా బతికేస్తామని.. ఇప్పుడు తమకు పని ఇవ్వకపోయినా బాధ పడమని రామ్, లక్ష్మణ్ తెలిపారు. ఇప్పుడు సినిమా ఎంతో మారుతోందని.. అప్‌డేట్ అవుతోందని.. అందుకు తగ్గట్లుగా తాము మారట్లేదని అనిపించినా.. తమ పని నచ్చకపోయినా.. ఏ మొహమాటం లేకుండా తమకు చెప్పొచ్చని.. అయ్యో మాస్టర్స్ ఏమనుకుంటారో అని తమకు అవకాశాలు ఇవ్వాల్సిన పని లేదని వాళ్లిద్దరూ స్పష్టం చేశారు.

సినిమా కంటే తాము ఎక్కువ కాదని.. సినిమాకు ఇక తాము ఉపయోగపడం అంటే.. దాన్ని అంగీకరించి పని మానేసి ఉన్నదాంతో హ్యాపీగా ఉంటామని.. ఎవరో తమ గురించి ఏదో అనడానికి ముందే.. అన్నింటికీ తాము ప్రిపేరై ఉన్నామని రామ్, లక్ష్మణ్ చెప్పారు.

Related Post

A Curious Box Office Pattern Around Pawan Kalyan’s Post-Agnyaathavaasi DirectorsA Curious Box Office Pattern Around Pawan Kalyan’s Post-Agnyaathavaasi Directors

Since Agnyaathavaasi, a curious box office pattern has quietly drawn attention among Telugu cinema followers. Every director Pawan Kalyan has collaborated with after that film appears to have come into