టాలీవుడ్లో మినిమం గ్యారంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి మల్టీస్టారర్ సినిమా విషయంలో చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారాయి.
మేకర్స్ ఎక్కడా రిస్క్ తీసుకోకుండా, షూటింగ్ పూర్తికాకముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో సేఫ్ జోన్లోకి వెళ్లాలని చూస్తున్నారట. అనిల్ రావిపూడి సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో సాహు గరపాటితో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు భాగస్వామి కావడంతో బిజినెస్ డీల్స్ చాలా ఈజీగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా వెంకటేష్, రావిపూడి రెమ్యునరేషన్ కు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ముందు అడ్వాన్స్ ఇచ్చేసి మిగతావి పక్కాగా షూటింగ్ ఫినిష్ అవ్వడానికి ముందు ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు టాక్. అంటే థియేట్రికల్ డీల్స్ తరువాత మరికొంత ఇచ్చేలా అన్నమాట.
కల్యాణ్ రామ్ మార్కెట్ లెక్కలు కూడా ఈ బడ్జెట్‌కు పెద్దగా ఇబ్బంది కలిగించేలా లేవని సమాచారం. నిర్మాతల అసలు ప్లాన్ ఏంటంటే.. సినిమా షూటింగ్ దశలో ఉండగానే వచ్చే నాన్ థియేట్రికల్ డీల్స్ ద్వారా చాలా వరకు నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులను సర్దుబాటు చేయాలనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సినిమా విడుదల సమయానికి మేకర్స్ చేతిలో థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే ఆదాయం మొత్తం లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
అనిల్ రావిపూడి బ్రాండ్ ఇమేజ్ వల్ల ఓవర్సీస్, నైజాం ఏరియాల్లో కూడా అప్పుడే ఎంక్వైరీలు మొదలయ్యాయట. కంటెంట్ మీద పూర్తి క్లారిటీ రాకముందే డీల్స్ క్లోజ్ చేయడం వల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గుతుంది. ఇక అనిల్ రావిపూడికి కూడా ఈ సినిమా చాలా కీలకం.
‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కంటెంట్ చూడకుండా డీల్స్ క్లోజ్ చేయడానికి రిస్క్ చేస్తారు. వారి నమ్మకాన్ని ఆడియెన్స్ అంచనాలను మరోసారి అందుకోవాల్సి ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కడా ల్యాగ్ లేకుండా, మూడు షెడ్యూల్స్‌లోనే చకచకా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ చివరి వారంలో మొదలయ్యే ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనుంది.