రెచ్చగొట్టి ప్రపోజ్ చేయించుకున్న కీర్తి సురేష్‌గత దశాబ్ద కాలంలో మోస్ట్ లవ్డ్ సౌత్ హీరోయిన్లలో కీర్తి సురేష్ పేరు ముందు వరుసలో ఉంటుంది. మహానటి సినిమాతో ఆమె తెలుగు వాళ్లనే కాక సౌత్ ఇండియన్ ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది కీర్తి. కెరీర్ మంచి ఊపులో ఉండగానే కీర్తి తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీ తటిల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఐతే ఆంటోనీతో కీర్తి ప్రేమలో ఉన్న విషయంలో బయటపడింది పెళ్లికి కొన్ని నెలల ముందే కానీ.. వారిది 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమకథ అని ఇటీవలే కీర్తి స్వయంగా వెల్లడించింది. కాలేజీ రోజుల్లోనే తాను ప్రేమలో పడ్డానని, కెరీర్ల మీద ఫోకస్ పెట్టిన తాము ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని కీర్తి ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు తన ప్రేమ కథ గురించి ఇంకొంచెం డీప్‌గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆంటోనీని తనే రెచ్చగొట్టి ప్రపోజ్ చేయించుకున్నట్లు ఆమె చెప్పడం విశేషం.
ఆంటోనీకి, తనకు మధ్య ప్రేమ ఆర్కుట్ రోజుల్లో మొదలైందని కీర్తి చెప్పింది. తనకు, ఆంటోనీకి కొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారని.. ఐతే తాము కలవడానికి ముందే ఆర్కుట్ ద్వారా ఫ్రెండ్స్ అయి.. ఒక నెల రోజుల పాటు చాట్ చేసుకున్నామని ఆమె తెలిపింది. తర్వాత కొచ్చిన్‌లోని ఒక రెస్టారెంట్లో తాను, ఆంటోనీ కలిశామంది. అప్పుడు తాను తన కుటుంబంతో కలిసి ఆ రెస్టారెంటుకు వెళ్లానని.. ఆంటోనీ తన స్నేహితులతో కలిసి వచ్చాడని ఆమె చెప్పింది.
ఐతే అక్కడ ఉన్నంతసేపు ఆంటోనీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. కానీ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేటపుడు అతణ్ని చూసి కన్ను కొట్టగా.. అతను ఈ అమ్మాయేంటి ఇలా చేస్తోందని షాకైనట్లు కీర్తి చెప్పుకొచ్చింది. ఇది జరిగాక కొన్ని రోజులకు తామిద్దరం ఒక మాల్‌లో కలిశామని.. అప్పుడు నీకు గట్స్ ఉంటే నాకు ప్రపోజ్ చేయి అని ఆంటోనీని రెచ్చగొట్టానని.. అలా అంటే ఏ అబ్బాయి స్పందించకుండా ఉంటాడని.. ఆంటోనీ న్యూ ఇయర్ రోజు తనకు ప్రపోజ్ చేశాడని.. తాను యాక్సెప్ట్ చేశానని.. అలా తమ ప్రేమకథ మొదలైందని కీర్తి వెల్లడించింది.