అమరావతి : రైతులు నష్ట పోకుండా డీజిల్ సరఫరా చేస్తామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్లకు డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతరంగా కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా సమీక్షించినప్పుడు ఉభయ గోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున డీజిల్ అవసరం అధికంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్నందున అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరగడం, ట్యాంకర్ల సరఫరా ఆలస్యం, జిల్లాల మధ్య హార్వెస్టర్ల మార్పిడి వల్ల అకస్మాత్తుగా డీజిల్ డిమాండ్ పెరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను పంపించడం, ముఖ్యమైన పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు ఏర్పాటు చేయడం, హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ , టోకెన్ వ్యవస్థ అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరా కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
The post రైతులు నష్టపోకుండా డీజిల్ సరఫరా : అచ్చెన్నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రైతులు నష్టపోకుండా డీజిల్ సరఫరా : అచ్చెన్నాయుడు
Categories: