hyderabadupdates.com movies వద్దన్న బిరుదు… వదిలేయడం మంచిదే

వద్దన్న బిరుదు… వదిలేయడం మంచిదే

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న కంప్లయింట్ రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వద్దని. ఆర్ఆర్ఆర్ టైంలో తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్న టైంలో ఈ గ్లోబల్ బిరుదుని తగిలించారు. ఆస్కార్ రేసులో ట్రిపులార్ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా రీచ్ వస్తుందనే ఉద్దేశంతో ముందు బాగానే ఉందనుకున్నారు. మెగా పవర్ స్టార్ కన్నా పర్ఫెక్ట్ ఉపమానం వేరొకటి లేదని, నాన్న బాబాయ్ ట్యాగ్స్ ని కలపడం కన్నా బెస్ట్ ఇంకేముంటుందని మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. గేమ్ ఛేంజర్ దాకా గ్లోబల్ స్టార్ తతంగం నడిచింది.

తాజాగా మొదలైన పెద్ది ప్రమోషన్లలో రామ్ చరణ్ కు ముందు గ్లోబల్ స్టార్ తీసేయడం పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ స్టార్ కైనా ఒక ముద్ర లేదా బిరుదు పడ్డాక కొత్తదాన్ని అలవాటు చేయడం చాలా కష్టం. ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ కన్నా స్టయిలిష్ స్టార్ నే ఎక్కువ ఇష్టపడటం అబద్దం కాదు. అయినా సరే మెల్లగా అడ్జస్ట్ అవ్వడంతో ఇబ్బంది కలగలేదు. కానీ రామ్ చరణ్ విషయంలో మెగా ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్న దర్శకుడు బుచ్చిబాబు మొత్తానికి అభిమానుల మనోగతాన్ని గౌరవించి మంచి నిర్ణయం తీసుకునేలా చేయడం ఒక చిక్కును తీర్చి పెట్టింది.

ఇకపై గ్లోబల్ స్టార్ కు రామ్ చరణ్ సెలవు ఇచ్చినట్టే. నిజానికి ప్రపంచవ్యాప్తంగా టామ్ క్రూజ్, జాకీ చాన్ రేంజ్ లో గుర్తింపు ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ప్రభాస్ తో సహా మన టాలీవుడ్ స్టార్లందరూ వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో తెలిసినవాళ్ళు ఉంటారనుకోవడానికి లేదు. అలాంటప్పుడు గ్లోబల్ అనడం భావ్యం కాదు. ఏదైతేనేం పెద్ది నుంచి కొత్త మార్పు అయితే మొదలయ్యింది. మార్చి 27 విడుదల తేదీలో ఎలాంటి చేంజ్ ఉండదని మేకర్స్ మరోసారి స్పష్టం చేయడంతో ఇంకో టెన్షన్ తీరినట్టయ్యింది. సంక్రాంతి తర్వాత ప్రమోషన్ల వేగం పెంచేలా మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ప్లానింగ్ లో ఉన్నాయి.

Related Post