బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 8 గంటల పని విధానంపై షరతులు పెట్టడాన్ని చాలామంది తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది డేట్లతో ముడిపడ్డ షూటింగ్స్‌లో టైమింగ్స్ పరంగా ఇంత కచ్చితంగా ఉంటే చాలా కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ఐతే దీపిక ‘స్పిరిట్’, ‘కల్కి-2’ చిత్రాల నుంచి తప్పుకోవడానికి ఈ ఒక్క కండిషనే కారణం కాదన్నది మాత్రం వాస్తవం.
పారితోషకం సహా పలు విషయాల్లో ఆమె గొంతెమ్మ కోర్కెలకు జడిసి ఆ చిత్ర బృందాలు ఆమెకు టాటా చెప్పేశాయనే చర్చ జరిగింది. ఐతే దీపిక చెప్పిన 8 గంటల పని విధానం విషయంలో మాత్రం ఇండస్ట్రీలో సానకూల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం రష్మిక మందన్నా టైమింగ్స్ చూసుకోకుండా పని చేయడంపై నిర్మాత ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా రష్మిక ఈ టాపిక్ మీద స్పందించింది.
ఆర్టిస్టులు, టెక్నీషియన్లు 9-6 ఆఫీస్ టైమింగ్స్ తరహాలో ఒక నిర్దిష్టమైన వేళల్లో పని చేయడం అవసరమని ఆమె అభిప్రాయపడింది. ఒక సినిమా తీయడంలో ఎంతోమంది భాగస్వామ్యం ఉంటుందని.. అందరినీ సర్దుబాటు చేసి.. ఒక లొకేషన్లో షూట్ చేయడం కష్టమే అని.. ఇంకో రోజు ఆ లొకేషన్ అందుబాటులో లేని పరిస్థితుల్లో అందరూ ఓవర్ టైం పని చేసి సన్నివేశాన్ని పూర్తి చేయాల్సిన అవసరం పడుతుందని.. అలాంటపుడు సహకరించడానికి తాను ఎప్పుడూ సిద్ధమని రష్మిక చెప్పింది.
కానీ ఇలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఎదురవుతుందని, తాను సర్దుకుపోతుంటానని ఆమె చెప్పింది. ఐతే ఇలా ప్రతిసారీ చెయ్యలేని పరిస్థితుల్లో నో చెప్పే స్థితిలో కూడా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. కుటుంబానికి సమయం కేటాయించడం, సరిగా నిద్ర పోవడం, వర్కవుట్ చేయడం.. ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలని.. ఇలా చేయకపోతే భవిష్యత్తులో బాధ పడాల్సి వస్తుందని.. కాబట్టి ఆర్టిస్టులైనా, టెక్నీషియన్లు అయినా ఆఫీస్ టైమ్స్ తరహాలోనే నిర్దిష్టమైన పని వేళల్లో పని చేసేలా నియమం పెట్టుకోవడం మంచిదే అని.. వ్యవస్థ అంతా అలా మారాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది.