గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్ బాబు, ప్రియాంకాచోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఇంటర్వ్యూలతో పాటు రాజమౌళి విడిగా చేసిన ఒక ముఖాముఖీ తాలూకు క్లిప్స్ ఆన్ లైన్ లో వైరలవుతున్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ తాలూకు కొన్ని విశేషాలను ఇందులో పంచుకున్నారు. ముఖ్యంగా వారణాసి రెండు భాగాలు కాదని, మూడు గంటల నిడివితో ఒకే భాగంగా వస్తుందని జక్కన్న క్లారిటీ ఇవ్వడంతో సీక్వెల్ మీద మబ్బులు తొలగిపోయాయి.
రామాయణం ప్రస్తావన, రాముడి గెటప్ కోసం మహేష్ పడిన కష్టం, విలన్ కుంభ క్యారెక్టరైజేషన్, టైటిల్ లాంచ్ టీజర్ కోసం టీమ్ పడిన సంవత్సర శ్రమ తదితర విషయాలన్నీ ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. మహేష్ కొత్తగా కనిపిస్తూ హుషారుగా మాట్లాడగా ప్రియాంకా, పృథ్విరాజ్ సైతం మంచి ఎనర్జీతో జోష్ ఇచ్చారు.
ఇది నెలల క్రితమే షూట్ చేసినప్పటికీ ప్రమోషన్ల కోసం చేసుకున్న ప్లాన్ లో భాగంగా కొంత ఆలస్యంగా వదిలారు. రిలీజ్ డేట్ కూడా హడావిడి లేకుండా సైలెంట్ గా ప్రకటించిన రాజమౌళి ఇకపై చేయబోయే ప్రచారాలు కూడా చెప్పా పెట్టకుండా సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంటాయని ఇన్ సైడ్ టాక్.
సగం దాకా షూటింగ్ పూర్తి చేసుకున్న వారణాసికి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే రాజమౌళి ఒక ప్రణాళికతో కీలక భాగాలను ముందు పూర్తి చేస్తున్నారు. పార్ట్ 2 ఒత్తిడి లేదు కాబట్టి ఆర్ఆర్ఆర్ ని మించిన బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
ఈసారి అంతర్జాతీయ స్థాయిలో వారణాసి మీద ఫోకస్ ఉంటుంది కనక ఆ అంచనాలు అందుకునేందుకు రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇతర క్యాస్టింగ్ ని సైతం గుట్టుగా ఉంచుతున్న రాజమౌళి ఒక్కో వివరాన్ని సందర్భానికి తగ్గట్టు రివీల్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ అందాకా వెయిట్ చేయాల్సిందే.