hyderabadupdates.com movies విక్ర‌మ్ కొడుకు సాధించాడా

విక్ర‌మ్ కొడుకు సాధించాడా

త‌మిళ లెజెండ‌రీ హీరో విక్ర‌మ్ ఘ‌న వార‌స‌త్వాన్ని అందుకుంటూ కొన్నేళ్ల కింద‌టే హీరోగా అరంగేట్రం చేశాడు ధ్రువ్. కానీ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెర‌కెక్కిన త‌న తొలి చిత్రం వ‌ర్మ డ‌స్ట్ బిన్‌లోకి వెళ్లిపోయింది. బాల తీసిన వెర్ష‌న్ నిర్మాత‌ల‌కు న‌చ్చ‌క.. అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గిరీశ‌య్య‌తో అదే చిత్రాన్ని ఆదిత్య వ‌ర్మ పేరుతో మ‌ళ్లీ తీశారు. అది ఓ మోస్త‌రు ఫ‌లితాన్నందుకుంది. త‌ర్వాత త‌న తండ్రితో క‌లిసి మ‌హాన్ అనే సినిమా చేసి మెప్పించాడు ధ్రువ్. కానీ ఈ రెండు చిత్రాలను అత‌ను ఓన్ చేసుకోలేక‌పోయాడు. అందుక్కార‌ణం ఒక‌టి రీమేక్, ఇంకోటి విక్ర‌మ్ హీరోగా చేసిన ఓటీటీ సినిమా.

ఈ నేప‌థ్యంలో ప‌రియేరుమ్ పెరుమాల్, క‌ర్ణ‌న్, మామ‌న్న‌న్, వాళై లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తీసిన మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన బైస‌న్‌ను త‌న అస‌లైన డెబ్యూ మూవీగా భావించాడు ధ్రువ్. ఈ సినిమా ప్రోమోలు భ‌లేగా అనిపించాయి. దీపావ‌ళి కానుక‌గా శుక్ర‌వార‌మే బైసన్ రిలీజైంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తే.. ప‌శుప‌తి కీల‌క పాత్ర చేశాడు. త‌మిళంలో డ్యూడ్, డీజిల్ సినిమాల‌తో పోటీ ప‌డ్డ బైస‌న్.. దీపావ‌ళి విన్న‌ర్‌ అంటూ తమిళ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిలో నిజం ఎంత ఉందో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

డ్యూడ్‌కు త‌మిళంలో మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. డీజిల్‌కు ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. కంటెంట్ ప‌రంగా బైస‌న్‌కు యునాన‌మ‌స్ టాక్ వ‌స్తోంది. ఇప్ప‌టిదాకా ఫెయిల్యూర్ ఎరుగ‌ని మారి సెల్వ‌రాజ్.. మ‌రోసారి హిట్టు కొట్టేశాడ‌ని క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు అంటున్నారు. బైస‌న్‌కు త‌మిళంలో 3.5, 4 రేటింగ్స్ ప‌డుతున్నాయి. సినిమాలో ధ్రువ్ విక్ర‌మ్ పెర్ఫామెన్స్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

కుల వివ‌క్ష కార‌ణంగా కెరీర్లో ఎద‌గ‌లేక ఇబ్బంది ప‌డే యువ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ పాత్ర‌లో అత‌ను జీవించేశాడ‌ని.. శారీర‌కంగా, మాన‌సికంగా అత‌డి ట్రాన్స్‌ప‌ర్మేష‌న్ అద్భుత‌మ‌ని అంటున్నారు. పెర్ఫామ‌ర్‌గా పేరు తేవ‌డంతో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గానూ అత‌డికి బైస‌న్ మంచి విజ‌యాన్నందిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కీల‌క పాత్ర చేసిన ప‌శుప‌తికి నేష‌న‌ల్ అవార్డు రావ‌చ్చ‌నే టాక్ వినిపిస్తోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌ట‌న‌కు కూడా ప్ర‌శంస‌లు ద‌క్క‌తున్నాయి. దీపావ‌ళి వీకెండ్లో తెలుగులో నాలుగు చిత్రాలు రిలీజ‌వుతుండ‌డంతో బైస‌న్‌ను ఇక్క‌డ వారం ఆల‌స్యంగా రిలీజ్ చేస్తున్నారు.

Related Post