hyderabadupdates.com movies విజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానే

విజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానే

తమిళంలో ఓ మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని నంబర్ వన్ హీరోగా కొనసాగాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడును దాటి విస్తరించిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఎవ్వరూ అందుకునే పరిస్థితి కనిపించలేదు. సినిమాల్లో కొనసాగినంత కాలం రజినీనే నంబర్ వన్ అనుకున్నారు ఓ పదేళ్ల ముందు వరకు. కానీ రజినీ వరుసగా ఫ్లాపులు ఇస్తున్న టైంలోనే తుపాకి, కత్తి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్లతో విజయ్ ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయాడు. 

ఆయన సినిమాల బిజినెస్, వసూళ్లు రజినీ చిత్రాలను కూడా దాటిపోయాయి. ఇప్పుడు తమిళంలో విజయే నంబర్ అనడంలో సందేహం లేదు. కానీ కెరీర్లో ఇలాంటి పీక్స్ అందుకున్న టైంలో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు విజయ్. భగవంత్ కేసరికి రీమేక్‌గా భావిస్తున్న ‘జననాయగన్’యే ఆయన చివరి సినిమా. ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చి సినీ రంగానికి విజయ్ టాటా చెబుతాడని భావిస్తున్నారు.

రాజకీయాల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో విజయ్ తిరిగి సినిమాల్లోకి వస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి ‘జననాయగన్’యే ఆయన చివరి చిత్రం. ఈ నేపథ్యంలో సినిమా చివర్లో విజయ్ ఫేర్‌వెల్‌ను ఘనంగానే ప్లాన్ చేస్తున్నాడట విజయ్. ముందు ముగింపు సన్నివేశాలను ఎమోషనల్‌గా ప్లాన్ చేశారట. కానీ తర్వాత విజయ్ సూచన మేరకు మార్పు చేశారట. విజయ్ సినీ కెరీర్‌ను సెలబ్రేట్ చేసేలా పతాక ఘట్టాన్ని ప్లాన్ చేశారట. 

అందులో విజయ్‌తో మంచి అనుబంధం ఉన్న దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ కనిపిస్తారట. వారికి విజయ్ ఒక బ్యాటన్ ఇవ్వనున్నట్లు చూపిస్తారట. ఇటీవలే రిలీజైన ‘దళపతి కచేరి’ పాట ఆఖర్లోనే వస్తుందట. చివరగా ఒక నిమిషం పాటు విజయ్ నాన్ స్టాప్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తాడట. ఆపై విజయ్ ఫిల్మోగ్రఫీలో పీక్ మూమెంట్స్‌ను చూపిస్తూ రోలింగ్ టైటిల్స్ పడతాడయని.. విజయ్ తన స్టయిల్లో అభిమానులకు అభివాదం చేయడంతో సినిమా ముగుస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Post