hyderabadupdates.com movies విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

రాజ‌కీయాల్లో విధేయుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కొత్త‌కాదు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత‌ల ప‌ట్ల విధేయంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వులు అల‌వోక‌గా వ‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జ‌న‌సేన‌లోనూ.. ఇదే త‌రహాలో ప‌ద‌వులు వ‌స్తున్నాయి. పార్టీలో న‌మ్మ‌కంగా ఉంటూ.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మైన రామ్ తాళ్లూరికి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క ప‌దవిని అప్ప‌గించారు. పార్టీ సంస్థాగ‌త, అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చేతిలో పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే జ‌నసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ్‌ను నియ‌మించారు.

నాగ‌బాబు నుంచి..

ప్ర‌స్తుతం నిన్న‌టి వ‌ర‌కు కూడా జ‌నసేన పార్టీ సంస్థాగ‌త , అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఎమ్మెల్సీ నాగ‌బాబు చూసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా నాగ‌బాబు చేతిలోనే ఈ ప‌ద‌వి ఉంది. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్సీ కావ‌డం, పార్టీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో కొన్నాళ్లుగా పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూసుకునేందుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యానికి తోడు.. పార్టీని విస్త‌రించాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఇప్పుడు నాగ‌బాబును ప‌క్క‌న పెట్టి.. ఈ ప‌ద‌విని.. రామ్ తాళ్లూరికి అప్ప‌గించారు.

ఎవ‌రీ రామ్‌?

రామ్ తాళ్లూరి నేటివ్ ప్లేస్ తెలంగాణ‌లోని ఖ‌మ్మం. ప్ర‌వాసాంధ్రుడు. అమెరికాలో ప‌లు సంస్థ‌లు నెల‌కొల్పి వ్యాపారాలు చేస్తున్నారు. వీటిలో లీడ్ ఐటీ కార్ప్‌, ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్, రామ్ ఇన్నోవేషన్స్ (రియల్ ఎస్టేట్) వంటి వ్యాపారాలు ఉన్నాయి. అయితే.. తొలుత సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయ‌న ప‌వ‌న్‌కు చేరువ అయ్యారు. త‌ర్వాత‌.. ఎస్ ఆర్టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాత‌గా మారి.. సినిమాలు చేశారు. ఆ త‌ర్వాత‌.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు.

ఇప్ప‌టి వ‌ర‌కు..

ఇక‌, జ‌న‌సేన పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ తాళ్లూరి.. ఐటీ విభాగానికి ఇంచార్జ్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌సంగాల‌ను.. హైలెట్ చేయ‌డంలోను.. ఐటీ విభాగాన్ని ముందుకున‌డిపించ‌డంలోనూ త‌న స‌మ‌ర్థ‌త‌ను చాటుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టును ఇచ్చారు. అటు ఐటీ విభాగాన్ని కూడా ఆయ‌నే న‌డిపించ‌నున్నారు. మొత్తానికి విధేయ‌త‌కు వీర‌తాడు వేసి.. పార్టీలో కొత్త జోష్ నింపార‌ని అంటున్నారు నాయ‌కులు.

Related Post