ఏపీలో అరాచకాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ప్రభుత్వం దారిలోకి తీసుకువచ్చింది. ప్రభుత్వంపైనా.. నాయకులు, మంత్రులపైనా నోరు చేసుకున్న వారికి చట్టం రుచి చూపించి.. సరిచేసే ప్రయత్నం చేసింది. అయితే.. సర్కారుకు సమస్యలు రోజు కోరకంగా వస్తున్నాయి.
గతంలో అడ్డు అదుపు లేకుండా.. ఆలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. అంతర్వేది ఆలయ రథానికినిప్పు పెట్టడంతోపాటు.. విజయవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన రధాలకు ఉన్న వెండి సింహాలను దొంగించారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఉన్న శ్రీరాముడి విగ్రహం తలను ఛేదించారు. ఇక, మరిన్ని ఘట నలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. అప్పట్లో గత ప్రభుత్వం ఆయా నిందితులపై కఠినంగా వ్యవహరింలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఇలాంటి అరాచకాలు.. ఆగినట్టే ఆగి.. ఇప్పుడు మరోసారి తెరమీదికి వచ్చాయి.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయంలో మహాపరాథం చోటు చేసుకుంది. దీనిపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. వీళ్లను ఏం చేయాలంటూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
ద్రాక్షారామంలోని ప్రఖ్యాత భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సమీపంలోని సప్తగోదావరి నది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి ఆలయంలో శివ లింగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. శివలింగాన్ని పెకలించడంతోపాటు.. పానవట్టాన్ని తీసుకువచ్చి.. సమీపంలోని మురుగు కాల్వలో పడేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసులు రంగంలోకి దిగి.. ఆధారాలు సేకరించారు. గతంలో జరిగిన ఘటనలు.. అప్పటి నిందితులపై దృష్టి పెట్టారు.
ఇదిలావుంటే.. ఈ ఘటన విషయం తెలిసిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు అధికారులతోనూ ఆయన మాట్లాడారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశించడంతో మరో శివలింగాన్ని ప్రతిష్టించారు.
ఇదేసమయంలో ఈ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా.. చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదేసమయం లో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఏం చేయాలన్న దానిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉన్న ఈఘటనను సీరియస్‌గా తీసుకోవాలని అధికారులకు సూచించారు.