hyderabadupdates.com Gallery వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం

వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం

వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం post thumbnail image

తిరుమ‌ల : భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం మరియు ప్రోత్సాహంలో టీటీడీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది. 1884 ఫిబ్రవరిలో మహంత్ ప్రయాగ్ దాస్ జీ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ వేద పాఠశాల ప్రారంభంలో మూడు విభాగాలతో మొదలై కాలక్రమేణా వేద, ఆగమ, పౌరోహిత్యం, శాస్త్ర విద్యలను సమగ్రంగా బోధించే విశిష్ట సంస్థగా అభివృద్ధి చెందింది. 1992లో తిరుమల ధర్మగిరిలో శాశ్వతంగా స్థాపించబడిన ఈ సంస్థకు “వేద విజ్ఞానపీఠం”గా పునర్నామకరణం చేశారు.
ప్రస్తుతం ఈ విజ్ఞానపీఠంలో నాలుగు ప్రధాన విభాగాల కింద మొత్తం 17 ప్రత్యేక విద్యా శాఖలు నిర్వహించ బడుతున్నాయి. వేదాధ్యయనంలో 7 వేద శాఖలు, ఆగమాధ్యయనంలో 5 ఆగమాలు, స్మార్త అధ్యయనంలో 4 విభాగాలు, దివ్య ప్రబంధంలో ఆళ్వారుల‌ 4000 పాశురాలు బోధించ బడుతున్నాయి. ఈ కోర్సులు దీర్ఘకాలికంగా నిర్వహించబడుతూ విద్యార్థులకు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నాయి.
ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం మొత్తం 374 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో వేద కోర్సుల్లో 140 మంది, ప్రబంధ-ఆగమ కోర్సుల్లో 177 మంది, స్మార్త కోర్సుల్లో 57 మంది ఉన్నారు. వీరికి బోధన అందించేందుకు 43 మంది పండితులు సేవలందిస్తున్నారు
విద్యార్థుల సంక్షేమానికి టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 540 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉన్న హాస్టల్ సౌకర్యాలు, శుభ్రమైన నివాస వాతావరణం, 24 గంటల నీటి సరఫరా, వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల‌కు పోషకాహారంతో కూడిన భోజనం అందించేందుకు ఉదయం పాలు, ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలు, మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరలు, సాంబారు, రసం, పెరుగు, సాయంత్రం పాలు, రాత్రి భోజనం అందిస్తున్నారు.
అదనంగా విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నిత్యావసర వస్తువులు (సబ్బులు, నూనెలు, పేస్ట్ మొదలైనవి) అందించ బడుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ కోసం అశ్విని ఆసుపత్రి ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందించ బడుతుండగా, అవసరమైతే తిరుప‌తిలోని స్విమ్స్, బ‌ర్డ్‌ ఆసుపత్రుల్లో కూడా ఉచిత చికిత్స అందిస్తున్నారు . వేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. వేద కోర్సుల విద్యార్థుల పేరుపై రూ.3 లక్షలు, ఇతర కోర్సుల విద్యార్థులకు రూ.ఒక‌ లక్ష డిపాజిట్ చేస్తోంది. కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా మొత్తం అందజేసి మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు శ్రీవారి 10 గ్రాముల వెండి డాలర్ ప్రదానం చేస్తారు.
విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా అమలవుతోంది. ఉదయం సంధ్యావందనం, అగ్నికార్యం నుంచి ప్రారంభమై పఠనం, బోధన, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానంలో కొనసాగుతోంది. వేద, శాస్త్ర, ఆగమ జ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు దేశ వ్యాప్తంగా ఉన్న పండితులను ఆకర్షిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను సత్కరించడం ఈ సదస్సు ప్రత్యేకత. ఇటీవల మార్చి 8 నుండి 13 వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
టీటీడీ ఆధ్వర్యంలో ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలు విజయవంతంగా నడుస్తున్నాయి. “వేదాలకు పుట్టినిల్లు తిరుమల” అనే మహోన్నత భావాన్ని సార్థకం చేస్తూ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే దివ్య విద్యా కేంద్రంగా నిలుస్తోంది. (టీటీడీ సౌజ‌న్యంతో)
The post వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

విజ‌య‌వాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక

పొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీపొంగ‌ల్ ప్రపంచ పండుగ‌గా మారింది : మోదీ

న్యూఢిల్లీ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొంగ‌ల్ పండుగ సంద‌ర్బంగా దేశ ప్ర‌జలంద‌రికీ పేరు పేరునా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. పొంగ‌ల్ ప్ర‌పంచ పండుగ‌గా ఆవిర్భ‌వించింద‌ని అన్నారు. త‌న‌కు

విద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవోవిద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవో

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో