విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయింది. వైజాగ్ లో సీఐఐ పార్ట్ నర్ సమ్మిట్ ఈ రోజు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు తరలి వస్తున్నారు. ఈ సీఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. సదస్సుకు 45 దేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి సంస్ధల సీఈవోలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. విశాఖ నుంచి వారానికి నాలుగు రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. సాధారణంగా రోజూ దాదాపు 60 విమాన సర్వీసులు ఉన్నాయి. సింగపూర్‌కు వెళ్లేందుకు ఎప్పటి నుంచో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
దుబాయ్ కి కూడా ఇక్కడి నుంచి విమాన సర్వీసు గత జూన్ లోనే ప్రారంభం అయింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలు రద్దీగా మారాయి. ప్రత్యేక విమాన సర్వీసులు లేకపోయినా ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ లలో వ్యాపార వేత్తలు తరలి వస్తున్నారు.
మరోవైపు విశాఖలో స్టార్ హోటళ్లు కూడా నిండిపోయాయి. నోవాటెల్ హోటల్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా హోటళ్లలో బస చేశారు.