రాష్ట్రంలో వైసిపి నాయకుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొన్ని బలమైన నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వుడ్ నియోజకవర్గాలు ఆది నుంచి వైసీపీకి అండగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తర్వాత కాలంలో వైసీపీకి మళ్ళింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు కావచ్చు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కావచ్చు.. బలమైన ఓటు బ్యాంకు ను ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశాయి. తద్వారా ప్రతి ఎన్నికలోను ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ మెజారిటీ దక్కుతోంది.
గత ఎన్నికల్లో పార్టీ 11 స్థానాలకే పరిమితం అయినప్పటికీ బద్వేల్ అదేవిధంగా అరకు వంటి నియోజకవర్గంలో వైసీపీ విజయం దక్కించుకుంది. సో దీనిని బట్టి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. బలమైన మద్దతు కూడా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించి, గతంలో మంత్రి పదవులు పొందిన వారు అదే విధంగా ఇతర నామినేటెడ్ పదవులు పొందిన వారు జగన్ దగ్గర మంచి పేరు సంపాదించుకున్న నాయకులూ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు.
అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ప్రజల పరిస్థితి ఏంటి.. అనేది కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా పెరిగాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో వైసీపీ జండా పట్టుకునే నాయకులే కనిపించడం లేదన్నది వాస్తవం. ఇదొక గుంటూరు జిల్లాకే పరిమితం అయిన సమస్య కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పోలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసీపీ తరఫున వాయిస్ వినిపించే నాయకుడు కూడా కనిపించకపోవడం విశేషం.
అదే విధంగా రంపచోడవరం వంటి కీలకమైన నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇబ్బందికర పరిస్తితిని ఎదుర్కొంటుంది. దీనిని సమీక్షించి సాధ్యమైనంత వేగంగా పరిస్థితులను చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసిపి ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు కూడా పదేపదే చెబుతున్నారు. మరి ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. అనేది వేచి చూడాలి.