hyderabadupdates.com movies శిల్పా రవికి ఈసారి టికెట్ లేనట్టేనా?

శిల్పా రవికి ఈసారి టికెట్ లేనట్టేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి.. అనే విషయాలు ఆసక్తిగా మారాయి ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో టిడిపి నాయకుడు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ నేతృత్వంలో కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగానే కాకుండా ఇరుగుపొరుగు జిల్లాలకు చెందిన మైనారిటీ వర్గాన్ని ఆయన హజ్ యాత్రకు తీసుకువెళ్లే విషయంలో కీలకంగా వ్యవహరించారు.

పార్టీ తరఫున అదే విధంగా వ్యక్తిగతంగా కూడా ఆయన బలంగా పనిచేస్తున్నారు. మంత్రిపరంగా కూడా ఆయన ముందు వరసలో ఉన్న విషయం కొన్నాళ్ల కిందట స్వయంగా చంద్రబాబు కూడా చెప్పారు. ఇది నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తోంది. వైసీపీ తరఫున కార్యక్రమాలు లేకపోవడం, ఆ పార్టీ తరపున యువ నాయకుడుగా ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అసలు కనిపించకపోవడం వంటివి టిడిపికి కలిసి వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీకి భారీ స్థాయిలో నష్టం జరుగుతోందన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.

వాస్తవానికి 2014లో వైసీపీ తొలిసారి ఇక్కడ విజయం సాధించింది. భూమా నాగిరెడ్డి వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న తర్వాత టిడిపిలోకి చేరారు. దీంతో ఇక్కడ వైసిపి బలోపేతం అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన మరణించడం, 2017 లో ఉపఎన్నిక రావడం, ఆ సమయంలో టిడిపి మరోసారి ఇక్కడ తన బలాన్ని నిరూపించుకోవడం తెలిసిందే. ఇక 2019లో వైసీపీ అధినేత జగన్ చేసిన పాదయాత్ర ఫలితంగా నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం దక్కించుకున్నారు.

గత ఎన్నికల్లో తిరిగి శిల్పా కుటుంబానికి టికెట్ దక్కినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 12,100 ఓట్ల పైచిలుకు తేడాతో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోయారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో యాక్టివ్ గా ఉండాల్సిన యువ నాయకుడు ఇప్పుడు వ్యాపారంలో పడ్డారు అనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. వచ్చే ఎన్నికల నాటికి ఈ టికెట్ను శిల్పాకు ఇవ్వరాదని పెద్ద ఎత్తున వైసిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

వచ్చే ఎన్నికల నాటికి ఈ టిక్కెట్ ఎవరికి ఇస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి శిల్పాకు ఇవ్వకపోవచ్చు అన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. యువ నాయకుడు అయి ఉండి కూడా ప్రజల మధ్యకు రాకపోవడం, పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టకపోవడం వంటివి రవిచంద్ర రెడ్డికి భారీ మైనస్ గా మారింది. ఇదే సమయంలో ఫరూక్ పుంజుకోవటం టిడిపికి అనుకూలంగా, పార్టీ కార్యకర్తలకు సానుకూలంగా మారడం విశేషం.

Related Post