hyderabadupdates.com movies శివ మీద నాగార్జున ప్రత్యేక శ్రద్ధ

శివ మీద నాగార్జున ప్రత్యేక శ్రద్ధ

తన కెరీర్ ని మలుపు తిప్పి టాలీవుడ్ కు కొత్త గ్రామర్ నేర్పించిన శివ రీ రిలీజ్ విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విడుదల తేదీ నవంబర్ 14 అయినప్పటికీ దానికి మూడు నాలుగు రోజుల ముందుగానే మీడియాకు స్పెషల్  షోలు వేయడం ద్వారా దీని మీద ప్రత్యేక అటెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మధ్య రీ రిలీజులు అంతగా వర్కౌట్ కావడం లేదు. కొన్ని కనీసం పబ్లిసిటీ ఖర్చులు తేలేకపోతున్నాయి. అయితే జగదేకవీరుడు అతిలోకసుందరికొచ్చిన ఎక్స్ ట్రాడినరి రెస్పాన్స్ గుర్తించిన నాగ్ దాని స్థాయిలోనే ఉండే శివకు ప్రత్యేక మార్కెటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఓవర్సీస్ లోనూ రెండు రోజుల ముందే ప్రీమియర్లు ఉంటాయని సమాచారం. శివ మీద ఇంత స్పెషల్ ఇంటరెస్ట్ చూపించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది ఇటీవలి కాలంలో వచ్చిన రీ రిలీజుల మాదిరి కాకుండా క్వాలిటీ విషయంలో శివ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇళయరాజా కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తాన్ని డాల్బీ స్టీరియో మిక్స్ చేయించి కొత్త అనుభూతి ఇవ్వబోతున్నారు. పాటలకు బేస్ పెంచి రాజా గొప్పదనాన్ని మరోసారి ఇప్పటి జనరేషన్ కు పరిచయం చేయబోతున్నారు. హాలీవుడ్ తరహా రీ మాస్టరింగ్ టెక్నాలజీ వాడినట్టు అన్నపూర్ణ వర్గాల కథనం.

ఎలాగూ నవంబర్ మొదటి రెండు వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. అందుకే శివకొచ్చే స్పందన పెద్దగా ఉంటుందని భావిస్తున్నారు. 1989లో విడుదలైన శివని టీవీ, యూట్యూబ్ లో చూడటం తప్ప ఇప్పటి జనరేషన్ కు థియేటర్ అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు. ఆ మాటకొస్తే రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కేవలం ఒక్క సినిమాతోనే ఎలా జీనియస్ అనిపించుకున్నాడనే ప్రశ్నకు సమాధానం శివలోనే దొరకనుంది. ప్రమోషన్లు కూడా స్పెషల్ గా చేస్తున్నారు. అల్లు అర్జున్ బైట్ ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఇలాంటి బోలెడు సర్ప్రైజులు రాబోయే రోజుల్లో చాలానే ఉంటాయట.

Related Post