ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు రావడం గత కొన్నేళ్లలో శ్రీవిష్ణుకి మాత్రమే జరిగింది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రూపంలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. అయితే ఇక్కడ సంతోషపడటానికి ఏం లేదు. ఎందుకంటే ఈ డబుల్ బొనాంజా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది కాబట్టి. ఇలాంటి ఫ్లాపులు వచ్చినప్పుడు మాములుగా స్పీడ్ తగ్గిపోతుంది. కానీ శ్రీవిష్ణు ఆ క్యాటగిరీ కాదంటున్నాడు.
వేగంగా పరుగులు పెడుతున్న వాళ్ళలో ఇప్పుడు శ్రీవిష్ణు టాప్ త్రీలో ఉన్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ సగానికి పైగానే పూర్తయ్యిందట. చివరి దశలో ఉన్నప్పుడు అప్డేట్స్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో టీమ్ సైలెంట్ గా ఉంది. సామజవరగమన కాంబో రిపీట్ చేస్తూ రామ్ అబ్బరాజు డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ కూడా ఫాస్ట్ గా అవుతోంది. ఇవి రెండు 2026లోనే రిలీజైనా ఆశ్చర్యం లేదు.
అదే జరిగితే కనక ఒకే సంవత్సరంలో మొత్తం నాలుగు సినిమాలు థియేటర్లకు ఇచ్చిన క్రెడిట్ శ్రీవిష్ణుకి దక్కుతుంది. ఇవి కాకుండా ఇంకో రెండు డిస్కషన్లో ఉన్నాయి. రవితేజ మాస్ జాతరతో నిరాశ పరిచిన రచయిత కం డైరెక్టర్ భాను భోగవరపు ఈసారి ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఫుల్ ఫన్ సబ్జెక్టు రాసుకున్నారట. దాదాపు లాకైనట్టేనని టాక్. రంగబలితో డిజాస్టర్ చూసిన పవన్ బసంశెట్టి కూడా శ్రీవిష్ణుతో ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. త్వరలోనే ప్రకటనలు వస్తాయి.
దర్శకుల ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా శ్రీవిష్ణు స్టోరీ నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న వైనం గమనించవచ్చు. అయితే కొంచెం క్వాలిటీ విషయంలో కూడా శ్రద్ధ పెట్టడం అవసరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విష్ణు విన్యాసంలో తన టైమింగ్, డైలాగ్ డెలివరీ మీద కాస్త నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. మాటలను మింగేయడమే కామెడీగా ఫీలవ్వడం మానాలని ఆడియన్స్ ఫీలింగ్. సరే లైనప్ అయితే ఇంటరెస్టింగ్ గానే ఉంది. థ్రిల్లర్స్ జోలికి వెళ్లకుండా శ్రీవిష్ణు పూర్తిగా వినోదాన్ని నమ్ముకోవడం మంచిదే.