తెలంగాణలోని పలువురు మంత్రుల ఫోన్లు హ్యాకయ్యాయి. ముఖ్యంగా యాక్టివ్‌గా ఉండే నాయకుల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. వీరి ఫోన్లలోని వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కొందరు జాతీయ మీడియా జర్నిలిస్టుల ఫోన్లను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసుకున్నారు. అయితే.. హ్యాకర్ల ఉద్దేశం ఏంటనేది తెలియాల్సి ఉంది. వీరి ఫోన్లకు `ఎస్బీఐ` పేరుతో ఏపీకే ఫైళ్లను పంపించారు. ఈ విషయాన్ని గుర్తించిన సైబర్ పోలీసులు మంత్రులు, జర్నలిస్టులను అప్రమత్తం చేశారు.
ఏం జరిగింది?
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత.. కొందరు మంత్రుల వాట్సాప్ గ్రూపులకు ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపారు. వరుసగా వచ్చిన ఈ సందేశాలతో ఒకరిద్దరు మంత్రులకు సందేహం వచ్చింది. దీంతో వారు తమ పీఏల ద్వారా .. విషయం తెలుసుకున్నారు. కొందరు హ్యాకర్లు.. ఈ పనిచేశారని గుర్తించారు. ఫోన్లను హ్యాక్ చేసే క్రమంలో కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ముందుగా వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసుకుంటున్నారని.. పోలీసులు తెలిపారు. ఏపీకే ఫైళ్లను అస్సలు క్లిక్ చేయొద్దని.. ఇది చేస్తే మొత్తంగా ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందని చెప్పారు.
మెసేజ్‌లో ఏముంది?
సైబర్ నేరగాళ్లు పంపించిన ఎస్ బీఐ మెసేజ్‌లో “ మీ ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. మీ పాన్ కార్డు అప్ డేట్ చేసుకోండి.“ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి ఫైల్స్ వస్తే.. సంబంధిత సంస్థపై అనుమానం వస్తుంది. కానీ, ఇక్కడే హ్యాకర్లు తెలివి ప్రదర్శించారు. ప్రతిష్ఠాత్మక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోగోను వినియోగించుకుని ఫోన్లను హ్యాక్ చేయాలని భావించారు. ఇదే పనిని జర్నలిస్టుల విషయంలోనూ చేశారు. ఈ కేవైసీ పేరుతో చేసిన ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన సైబర్ పోలీసులు.. మంత్రులు, జర్నలిస్టులను అప్రమత్తం చేశారు.
అయితే.. అప్పటికే పలువురు ఎస్ బీఐ మెసేజ్‌లోపై క్లిక్ చేయడంతో పలు మీడియా గ్రూపులు, సీఎంవో గ్రూపులు, డిప్యూటీ సీఎంవో గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులను హ్యాకర్ల తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లూ హ్యాక్ అయ్యాయని సందేశాలు వచ్చాయి. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. హ్యాకర్లను గుర్తించే పనిలోనూ పడ్డారు.