తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశంలో ఉన్నవారు సైతం సొంతూరికి చేరుకోవాలని భావిస్తారు. ఈ సంక్రాంతి జర్నీకి ముందుగా ప్లాన్ చేసుకోకపోతే కష్టమే మరి..! ఏటా తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి సమయంలో లక్షల మంది తరలి వెళ్తారు. సొంత వాహనాలతో ప్రయాణం చేస్తున్న వారితో టోల్ గేట్లు, హైవే రద్దీగా మారిపోవడం మనకు తెలిసిందే. అయితే బస్సులు రైళ్లు విమానాల్లో ప్రయాణించే వారికి మాత్రం ముందుగానే ప్లానింగ్ ఉండాలని సూచిస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి ఇంకా దాదాపు ఆరువారాలపైగా సమయం ఉంది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు భర్తీ అయిపోయాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు 500 కు పైగా ఉందంటే ఆశ్చర్య పోవాల్సిందే. గోదావరి, నారాయణాద్రి, శబరి, పద్మావతి ఎక్స్ప్రెస్ లలో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోయాయి. ముఖ్యంగా 2026 జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఫుల్ డిమాండ్ ఉంది. పండగ సమయంలో తెలంగాణ ఏపీలోని ఆర్టీసీ సర్వీసులు ప్రత్యేక బస్సులు నడుపుతాయి.
రైళ్లలో ఖాళీ లేకపోవడంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ప్రైవేటు బస్సు సర్వీసులు ఆ సమయంలో అధిక ధరలు వసూలు చేస్తూ ఉంటారు. విమాన సర్వీసులో కూడా 10, 11, 13 తేదీల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రైవేట్ విమాన సర్వీసులు టికెట్ ధరలు పెంచేశాయి. హైదరాబాదు రాజమండ్రి విమాన సర్వీ సు సాధారణ రోజుల్లో 5000 లోపే ఉండగా.. సంక్రాంతి సమయంలో రూ.10000 కు పెంచేశారు.
ఎంత కష్టమైనా ఖర్చైనా పండుగకు సొంత ఊరికి వెళ్లి రావాల్సిందే. ఉన్నత వర్గాల వారు, ఏదోరకంగా తమ గ్రామాలకు వెళ్ళిపోతారు. సామాన్య మధ్యతరగతి వారికి సంక్రాంతి ప్రయాణం భారంగా మారనుంది. దీంతో ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు.