ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అన్నారు. కానీ ప్రమోషన్ల జాడ లేదు. ఒకవేళ పెద్ది కనక ఏప్రిల్ 30 తప్పుకుంటే ఆ స్లాట్ లో వద్దామనే ఆలోచనలో టీమ్ ఉంది కానీ నిజంగా రామ్ చరణ్ వస్తాడా రాడానే అయోమయం కొనసాగుతూనే ఉంది. అసలు పెద్దిని బేస్ చేసుకుని స్వయంభు వెయిటింగ్ గేమ్ ఆడటం ఎంత మాత్రం సేఫ్ కాదు.
ఎందుకంటే నిఖిల్ చేసింది ఏదో ఆషామాషీ చిన్న సినిమా కాదు. కార్తికేయ 2 లాగా అన్ని భాషల్లో రీచ్ అయ్యేందుకు స్కోప్ ఉన్న కంటెంట్. బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు . టీజర్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన కూడా లేకపోలేదు. అయితే స్వయంభుకి బజ్ పెంచాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది. ఎందుకంటే నిఖిల్ ఇమేజ్, మార్కెట్ ని మించిన సబ్జెక్టు ఇది. ప్రభాస్ కటవుట్ స్థాయిలో రాసుకున్నాడు దర్శకుడు భరత్ కృష్ణమాచార్య.
సో దానికి న్యాయం జరగాలంటే ఏదో ఒక రూపంలో స్వయంభు సౌండ్ వినిపిస్తూ ఉండాలి. షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. దీని కన్నా ఆలస్యంగా వచ్చే నాగబంధం ఆల్రెడీ మే నెలలో డేట్ వేసుకుని దానికి తగ్గ పబ్లిసిటీ ప్లాన్ తో ఉంది. మరి నిఖిల్ బృందం మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటో ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందైతే స్వయంభు ఏదో ఒక తేదీ మీద అనౌన్స్ మెంట్ ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి పోటీ ఉందో చెక్ చేసుకుని మరీ ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. దీని మీదే నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారట. ఓటిటి డీల్ గురించి కూడా సరైన క్లారిటీ లేదు. నిఖిల్ మాత్రం స్వయంభు మీద టన్నుల్లో ఆశలు పెట్టుకున్నాడు.