వైసీపీ అధినేత జగన్‌కు సోదరి, 2019లో దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు బిగ్ రిలీఫ్ దక్కింది. తన తండ్రి దారుణ హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న సునీత అనేక మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బాధితులుగా ఉన్న సునీతపైనే వైసీపీ హయాంలో కేసులు నమోదయ్యాయి. కారణాలు ఏవైనా, అప్పటి పోలీసులు ఆమెపైనే కేసు పెట్టారు.
సునీత సహా ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై అప్పటి కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్‌ఐ, మరొకరు ఏఎస్పీ. అయితే ఈ కేసులను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఇది ఒకరకంగా సునీతకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇప్పుడు దీనికి మించిన రిలీఫ్ ఇస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పట్లో సునీత దంపతులపై కేసులు నమోదు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
అంటే అప్పట్లో సునీత, ఆమె భర్తపై కేసులు పెట్టిన ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఇద్దరూ గత ఏడాదే రిటైరయ్యారు. అయినప్పటికీ వారిపై శాఖాపరమైన దర్యాప్తు చేయించడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాదు అసలు ఈ కేసులు నమోదు చేయాలని తెర వెనుక నుంచి ఎవరు ప్రోత్సహించారన్న విషయంపైనా కూపీ లాగనుంది.
మరోవైపు సునీతపై తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది మరింతగా సదరు రిటైర్డ్ అధికారుల మెడకు చుట్టుకోనుంది. ఈ ఫిర్యాదుతో కొత్తగా కేసు నమోదు చేయనున్నారు. ఒకప్పుడు ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసిన అధికారులే ఇప్పుడు నిందితులుగా మారనుండటం విశేషం.
మొత్తంగా వివేకా కేసులో ఇన్నేళ్ల తర్వాత సునీతకు కొంతలో కొంత బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది.