కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్రాండియర్ విడుదల తేదీని 2027 ఈద్ (రంజాన్) గా ప్రకటించారు. అంటే మార్చి 9 లేదా 10 థియేటర్లలో అడుగు పెట్టాలి. అయితే ఇంతకు ముందే స్పిరిట్ మార్చి 5 అఫీషియల్ గా లాక్ చేసుకుంది. దానికి అనుగుణంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షెడ్యూల్స్ వేసుకుని షూటింగ్ చేస్తున్నారు.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్పిరిట్ తో తలపడేందుకు ఏ నిర్మాతా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ కాంబో మీద ఉన్న క్రేజ్ అలాంటిది. యానిమల్ టైంలోనే వంగా ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే బాలీవుడ్ వర్గాలు రుచి చూశాయి. అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ కంటెంట్ తో తొమ్మిది వందల కోట్లకు పైగా వసూలు చేయడం మాటలు కాదు. స్పిరిట్ అంతకు రెట్టింపు ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకం డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఉన్నాయి.
ప్రభాస్ స్టామినా తెలిసినవాడిగా దిల్ రాజు, డార్లింగ్ ఇమేజ్ ని తక్కువ అంచనా వేయని సల్మాన్ ఖాన్ ఇక్కడ స్పిరిట్ విషయంలో ఒకటి బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. అదే వాయిదాల పర్వం. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ పూర్తి చేసే సంకల్పంతో ఉన్నాడు. స్పిరిట్ కు సహకారం అందిస్తున్నప్పటికీ సోలో డేట్స్ కోసం ట్రై చేస్తున్న వంగాకు అది సాధ్య పడటం లేదు. ఇంకోవైపు కల్కి 2 కూడా మొదలైపోయింది. దానికీ కాల్ షీట్స్ ఇవ్వాలి.
సో చెప్పిన డేట్ కి స్పిరిట్ వస్తుందన్న గ్యారెంటీ లేని నేపథ్యంలో తెలివిగా సల్మాన్ కోసం స్లాట్ లాక్ చేసుకోవడం మంచి స్ట్రాటజీనే. ఒకవేళ స్పిరిట్ కనక మాట తప్పకుండా మార్చి 5 వస్తే మాత్రం సల్లు భాయ్ మీద ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ మూవీని తీస్తున్నది బలమైన నెట్ వర్క్ ఉన్న టి సిరీస్ సంస్థ. సల్మాన్ ఖాన్ కు ఎంత బయ్యర్ల సపోర్ట్ ఉన్నా డైరెక్టర్ బ్రాండ్ కొంత మైనస్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో చాలా కీలక పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి.