ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మసకబారుతోంది. పదే పదే వరసగా పాత సినిమాలను థియేటర్లకు తీసుకొస్తుండటంతో జనాలకు మొహం మొత్తుతోంది. పైగా రూపాయి తగ్గించకుండా ఇప్పుడున్న రేట్లకే బాదుతుండటంతో ప్రేక్షకుల నుంచి స్పందన కరువుతోంది. ఆ మధ్య స్టాలిన్, యమదొంగ, ఆదిత్య 369 లాంటి చెప్పుకోదగ్గ మూవీస్ కే సంకట స్థితి తప్పలేదు. ఇలాంటి టైంలో ఒక కన్నడ డబ్బింగ్ మూవీ పునః విడుదల చేయడం విశేషమే. కాకపోతే ముందు నుంచి సౌండ్ చేయకుండా హఠాత్తుగా అక్టోబర్ 11 డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ కూడా వదిలేయడం ఆశ్చర్యం. ఆ మూవీ పేరు ఉపేంద్ర. అప్పటి సినీ ప్రియుల హాట్ ఫేవరెట్.
1999లో వచ్చిన ఉపేంద్ర చిన్న హిట్టు కాదు. బ్లాక్ బస్టరే. A తెచ్చిన క్రేజ్ పుణ్యమాని భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడంతో పాటు విచిత్రమైన హీరో క్యారెక్టరైజేషన్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రవీనాటాండన్, ప్రేమ హీరోయిన్లుగా నటించగా గురుకిరణ్ సంగీతం అప్పటి మాస్ ని ఊపేసింది. ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు ఇండియా, జపాన్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు నోచుకుంది. ప్రశాంత్ నీల్ లాంటి ఎందరో న్యూ ఏజ్ డైరెక్టర్లకు ఉపేంద్ర ఒక రిఫరెన్స్ లాంటిది. అంతటి బిల్డప్ ఉన్న ఉపేంద్రని కొన్ని నెలల క్రితం కర్ణాటకలో రీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన దక్కింది.
తెలుగులో ఇంత సడన్ గా ఉపేంద్రని తేవడం వెనుక కారణం లేకపోలేదు. ఉపేంద్ర రీ రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్నారు. ఇదే సంస్థ నిర్మిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకాలో ఉపేంద్ర చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆ బాండింగ్ తోనే ఇప్పుడీ రీ రిలీజ్ చేశారని అనుకోవచ్చు. ఏది ఏమైనా నటుడిగా దర్శకుడిగా ఉపేంద్రని ఎందుకు చాలా మంది ఇష్టపడతారో తెలియాలంటే ఉపేంద్రని ఒకసారి ఎక్స్ పీరియన్స్ చేయాలి. కాకపోతే ముందు నుంచి జనాలను ప్రిపేర్ చేస్తూ ప్రమోషన్లు చేసి ఉంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. మరి ఇప్పుడు ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.