బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఢాకాలో ఉన్న అంతర్జాతీయ నేర వివాదాల పరిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా మరణ శిక్ష విధించింది. 2023-24 మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న రిజర్వేషన్ల ఉద్యమం.. తీవ్ర రూపం దాల్చినప్పుడు .. ప్రధానిగా హసీనా వ్యవహరించిన తీరుతో నిరుద్యోగులు, విద్యార్థులు రగిలిపోయారు. ఇది దేశంలో పెను ఉత్పాతానికి దారి తీసింది. ఫలితంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. వీటిని దారిలో పెట్టే క్రమంలో హసీనా దుందుడుకుగా వ్యవహరించారు. ఉద్యమకారులపై కాల్చి వేత ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా నాటికి సైనిక దాడిలో 1400 మంది యువత ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం.. దేశంలో చోటు చేసుకున్న పరిణామాలతో హసీనా.. ఆ దేశాన్ని విడిచి భారత్‌కు వచ్చేశారు. నాటి అభియోగాలపై జరిగిన తుది విచారణలో ఆమెకు మరణ శిక్ష విధిస్తూ.. ఢాకాలో ఉన్న అంతర్జాతీయ నేర వివాదాల పరిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా తీర్పు వెలువరించింది. అయితే.. ఈ పరిణామాలు.. హసీనా కంటే కూడా.. ఆమెకు ఆశ్రయం కల్పించిన భారత్‌పైనే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తీత్కాలిక ప్రభుత్వం.. హసీనాకు తమకు అప్పగించాలని ఇప్పటికే పలుమార్లు భారత్‌ను కోరింది. కానీ, దీనిపై ప్రధాని మోడీ స్పందించలేదు.
దీనికి భారత్ చెబుతున్న ఏకైక కారణం.. నిందితుల అప్పగింత ఒప్పందం ఇరు దేశాలకు లేదనే. ఇది వాస్తవమే. ఎందుకంటే.. ఇప్పటి వరకు భారత్-బంగ్లాలు వేర్వేరు దేశాలే అయినా.. దాదాపు అన్ని విషయాల్లోనూ కలివిడిగానే ఉన్నాయి. ప్రధానంగా హసీనానే 30 ఏళ్లపాటు అధికారంలో ఉండడంతో భారత్‌తో ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. పైగా బంగ్లాకు స్వాతంత్రం లభించడంలో భారత్ కీలక రోల్ పోషించింది. ఈ నేపథ్యంలో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఇరు దేశాల మధ్య లేదు. కానీ, ప్రస్తుత ప్రధాని.. నోబెల్ గ్రహీత యూనస్ మాత్రం పాకిస్థాన్‌తో చేతులు కలిపి.. భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.
అంతర్జాతీయ చట్టాలకు.. భారత్ కట్టుబడి ఉండాలని యూనస్ కోరుతున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య అలాంటి ఒప్పందం లేదని కేంద్రం చెబుతోంది. కానీ. యూనస్ మాత్రం అటు పాకిస్థాన్, అమెరికా, చైనాలతో చెలిమి చేస్తూ.. భారత్‌పై హసీనాను అప్పగించే విషయంలో ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా తీర్పు కూడా వెలువడిన నేపథ్యంలో ఈ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందని.. భారత్ కూడా అంచనా వేసింది. దీంతో బంగ్లా సరిహద్దుల్లో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది. తాజా తీర్పు అనంతరం.. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే వ్యూహంతో మరింత అప్రమైంది. అటు పాకిస్థాన్, ఇటు బంగ్లాదేశ్‌లు.. ఇప్పుడు భారత్‌పై కాలుదువ్వే ప్రయత్నం చేయొచ్చన్న అంచనాలు కూడా వస్తున్నాయి.