ఏపీలో సీఎం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న యువ నాయకుడు నారా లోకేష్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్తున్నా రు. శాఖలతో పనిలేకుండా.. ప్రజల మేలు పరమావధిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. దాదాపు రెండు మాసాల తర్వాత.. ఫ్యామిలీకి సమయం ఇచ్చారు. ఇటీవల రెండు మాసాలుగా మంత్రి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటన.. అనంతరం.. తుఫానులు.. వర్షాల నేపథ్యంలో ఆయన అమరావతికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీకి ఎంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో శుక్రవారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు.
అయితే.. శనివారం ఉదయం.. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గలో ఉన్న ఓ ప్రైవేటు ఆలయంలో తొక్కిస లాట జిరిగింది. కార్తీక మాసం, తొలిశనివారం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వాస్తవానికి రెండు వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉండగా.. తాజాగా శనివారం వేలాది మంది తరలి వచ్చారు. దీంతో క్యూలైన్లో చోటు చేసుకున్న అలజడి తొక్కిసలాటకు దారి తీసింది. వాస్తవానికి.. ఏకాదశి కావడంతో ఓ భక్తుడు ఉదయం నుంచి ఏమీ తీసుకోకుండా.. ఉపవాసం ఉన్నారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భక్తులు ఏదో జరిగిందన్న భ్రమతో తోసుకున్నారు. ఈ ఘటన మరణాలకు దారితీసింది.
ప్రస్తుతం 30 మందికి పైగా భక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వచ్చారు. నేరుగా ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని కూడా మంత్రి ఆరా తీశారు. ప్రాణాలు రక్షించాలని.. ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని వైద్యులకు సూచించారు. అవసరమైతే.. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేటు వైద్య శాలలకు తరలించి అయినా.. కూడా వారిని కాపాడాలని సూచించారు.
దాదాపు రెండు గంటలుగా మంత్రి లోకేష్ ఆసుపత్రుల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. మరోవైపు.. లండన్లో సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గాయపడిన వారికి, స్పృహ కోల్పోయిన వారికి వైద్య సేవలు అందించాలన్నారు. ఇదిలావుంటే.. మంత్రి నారా లోకేష్ హుటాహుటిన స్పందించడం.. నేరుగా ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించడం వంటివి బాధిత కుటుంబాలకు ఓదార్పునిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.