hyderabadupdates.com movies అందుకే సంక్రాంతి చాలా స్పెషల్

అందుకే సంక్రాంతి చాలా స్పెషల్

సంక్రాంతి పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు అంతగా ఎందుకు పోటీ పడతారో.. ఈ సీజన్లో సినిమాలను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎందుకలా ఎగబడతారో మరోసారి అందరికీ అర్థమవుతోంది. ఈ సంక్రాంతి కొత్త ఏడాదికి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. రిలీజైన ఐదు చిత్రాలూ వాటి వాటి స్థాయిలో బాగానే ఆడుతున్నాయి. అన్నింట్లోకి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ఐదో రోజు కూడా ఈ చిత్రానికి అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ వీకెండ్‌కు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. 

అదే సమయంలో మిగతా సంక్రాంతి చిత్రాలకు కూడా ఏమీ ఢోకా లేదు. నవీన్ పొలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల సెకండ్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఆరంభం నుంచే ఈ సినిమా అదరగొడుతోంది. ఈ చిత్రానికీ టికెట్లు అంత తేలిగ్గా దొరకట్లేదు. ఇక కొంచెం నెమ్మదిగా మొదలైన చివరి సంక్రాంతి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ పరిమిత స్క్రీన్లలోనే దుమ్ము దులుపుతోంది. శుక్రవారం అయితే శర్వా సినిమా అదరగొట్టేసింది. శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ కనిపిస్తోంది.

చిరు, నవీన్, శర్వా సినిమాలకు పాజిటివ్ టాక్ బాగా పని చేస్తోంది. ఇక యావరేజ్ టాక్‌తో మొదలైన రవితేజ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆరంభంలో డల్లుగానే నడిచింది. కానీ ఆ చిత్రానికి కూడా క్రమంగా కలెక్షన్లు పుంజుకున్నాయి. శుక్రవారం ఈ చిత్రానికి కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘రాజా సాబ్’ సైతం నాట్ బ్యాడ్ అనిపిస్తోంది. ప్రభాస్ స్టార్ పవర్, సీజన్ అడ్వాంటేజీ వల్ల ఈ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మిగతా సంక్రాంతి చిత్రాల ఓవర్ ఫ్లోస్ దీనికి కలిసి వస్తున్నాయి. 

సంక్రాంతి సీజన్ వల్ల యావరేజ్, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా ఎలాంటి అడ్వాంటేజీ ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. ఇలా ఒకేసారి ఐదు చిత్రాలు రిలీజై.. అన్నీ బాగా ఆడడం అన్నది అరుదైన విషయం. 2025లో నిరాశకు గురైన తెలుగు సినిమాకు ఈ ఏడాది గొప్పగా కలిసి రాబోతోందనే సంకేతాలను సంక్రాంతి సినిమాలు ఇస్తున్నాయి.

Related Post